జాతీయ విద్యావిధానం(ఎన్ఈపీ) అమలు ప్రక్రియను ఎలా ప్రారంభిస్తే బాగుంటుందో ఉపాధ్యాయులు, ప్రిన్సిపాళ్ల సలహాలు తీసుకోవాలని కోరుతూ కేంద్ర పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి అనితా కర్వాల్ దేశంలోని అన్ని రాష్ట్రాల విద్యాశాఖ కార్యదర్శులకు లేఖ రాశారు.
" పాఠశాల విద్యకు సంబంధించిన అంశాలపై ప్రశ్న-సమాధానం రూపంలో ఉపాధ్యాయుల నుంచి సూచనలు ఆహ్వానిస్తున్నాం. ప్రతి ప్రశ్న జాతీయ విద్యావిధానంలోని ఏదో ఒక పేరాకు సంబంధించి ఉంటుంది. అందువల్ల ఉపాధ్యాయులు ఆ ప్రశ్నకు సంబంధించిన పేరాను చదివి అర్థం చేసుకున్న తర్వాత సూచనలు, సలహాలు అప్లోడ్ చేయొచ్చు. ఇలా వచ్చే అన్ని సలహాలను పరిశీలించడానికి ఎన్సీఈఆర్టీ నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ప్రస్తుతం సూచనలను పరిమిత పదాల్లో స్వీకరిస్తున్నప్పటికీ, అందులో ఎంపిక చేసిన వాటిపై తదుపరి విస్తృత సమాచారం తీసుకుంటాం. ఆసక్తి కలవారు https://innovateindia.mygov.in/nep2020 వెబ్ అడ్రస్‌కు వెళ్లి తొలుత వివరాలు రిజస్టర్ చేసుకోవాలి. తర్వాత అధ్యాయాల వారీగా ప్రశ్నలను ఎంచుకోవాలి. ఉపాధ్యాయులు తమ సొంత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని సూచనలు చేయాలి. అన్ని ప్రభుత్వ, ప్రేవేటు ఉపాధ్యాయులందరూ వీటిని పంపిచవచ్చు. ఈ నెల 24 నుంచి 31వ తేదీలోగా వీటిని అప్లోడ్ చేయాలి. వాట్సాప్ గ్రూపులు, విడీయో సమావేశాల ద్వారా ఈ విషయాన్ని ఉపాధ్యాయులకు తెలియజేయాలి' అని లేఖలో పేర్కొన్నారు.
ఇదీ చూడండి: కాంగ్రెస్ పగ్గాలు ఎవరికి? నేడు సీడబ్ల్యూసీ కీలక భేటీ