నేడు ప్రవేశపెట్టనున్న తాత్కాలిక బడ్జెట్లతో దేశ ఆర్థిక వ్యవస్థను బలపరచడంపై భాజపా ప్రభుత్వ నిబద్ధత ఎలా ఉందో తెలుస్తుందని ఫిచ్ అభిప్రాయపడింది.
ఓటర్లను ఆకర్షించడానికి... ముఖ్యంగా గ్రామీణ, చిరు వ్యాపారులు ఓట్లు గెలవాలంటే.. ప్రత్యేక కేటాయింపులు తప్పనిసరి. వీళ్ల మద్దతు లేకుండా సార్వత్రిక ఎన్నికల్లో భాజపా గెలుపు అసాధ్యం.
గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న అసహనం, నిరుద్యోగం కారణంగా ఈ మధ్య జరిగిన మూడు రాష్ట్రాల ఎన్నికల్లో మోదీ సర్కారుకు ఎదురుదెబ్బ తగిలింది. రైతులకు మద్దతు ధరలు, పెట్టుబడి సాయం, రుణమాఫీ కోసం గత ప్రభుత్వాలు బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించేవి. ఇదే పద్ధతిని మోదీ సర్కారు అనుసరించే అవకాశముందని ఫిచ్ తెలిపింది.
ప్రజాకర్షణ పథకాల కోసం ఎక్కువ నిధులు కేటాయిస్తే ఆర్థిక వ్యవస్థ పై భారమే కాకుండా, రెవిన్యూ లోటు పెరిగే అవకాశముందని ఫిచ్ హెచ్చరించింది.
ఎన్నికల ముందు అధిక ఖర్చు వల్ల తర్వాత ఆర్థిక కష్టాలే కాకుండా, ప్రభుత్వ లక్ష్యాలకు ఆటంకాలు ఎదురవుతాయని, అప్పుల భారం పెరుగుతుందని ఫిచ్ పేర్కొంది. సుస్థిర ఆర్థిక వృద్ధికి దీర్ఘ కాల ప్రణాళికలు అవసరమని ఫిచ్ తెలిపింది.