బాబ్రీ కేసు తీర్పు వెలువడనున్న నేపథ్యంలో ఉత్తర్‌ప్రదేశ్ రాజధాని లఖ్‌నవూలో భద్రత కట్టుదిట్టం చేశారు. నగరంలోని పలు ప్రాంతాల్లో పోలీసులను మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ప్రస్తుతం పరిస్థితులు ప్రశాంతంగానే ఉన్నాయని డీసీపీ డీకే పాండే తెలిపారు. ప్రజలు ఎలాంటి వదంతులను నమ్మవద్దని కోరారు.
"భద్రత కట్టుదిట్టం చేశాం. సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు కోసం అన్ని భద్రత ఏర్పాట్లు చేస్తున్నాం. ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడుతున్నాం. లఖ్‌నవూతో పాటు కోర్టు పరిసరాలలో భారీగా పోలీసులను మోహరించాం. జిల్లాలోని ప్రధాన కూడళ్లలో పోలీసులు తనిఖీ నిర్వహిస్తున్నారు. ఎలాంటి వదంతులు నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరైనా వదంతులు ప్రచారం చేస్తే పోలీసులకు సమాచారం అందించాలని కోరుతున్నా."
-డీకే పాండే, లఖ్‌నవూ డీసీపీ
32 మంది నిందితులు
ఈ కేసులో భాజపా అగ్రనేతలు ఎల్కే అడ్వాణీ, మురళీ మనోహర్ జోషి, ఉమా భారతి, కల్యాణ్ సింగ్ సహా పలువురు నిందితులుగా ఉన్నారు. మొత్తం 49 మందిని నిందితులుగా గుర్తించగా.. అందులో 17 మంది మరణించారు. మిగిలిన 32 మందిని తీర్పు రోజు తమ ముందు హాజరు కావాల్సిందిగా సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఆదేశించారు.
ఈ కేసులో నిందితులకు వ్యతిరేకంగా 351 సాక్ష్యాలతో పాటు 600 డాక్యుమెంటరీ ఆధారాలను కోర్టుకు సీబీఐ సమర్పించింది.
అనుమతిస్తే వస్తా: ఉమా
కరోనా బారిన పడ్డ మాజీ కేంద్ర మంత్రి ఉమా భారతి ప్రస్తుతం రిషికేష్ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. వైద్యులు అనుమతి ఇస్తే కోర్టుకు హాజరవుతానని సోమవారం ట్వీట్ చేశారు.
ఇదీ చదవండి- బాబ్రీ కేసులో కోర్టు తీర్పునకు కట్టుబడి ఉంటా: ఉమాభారతి