కరోనా కట్టడికి లాక్డౌన్ అస్త్రాన్ని ఉపయోగించింది భారత ప్రభుత్వం. అయితే అనేక మంది తిండి, గూడు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మూగజీవాల పరిస్థితి కూడా దయనీయంగా మారింది. తిండి, నీరు లేక ఆకలికి అలమటిస్తున్నాయి. అందులో వేసవి కాలం కావడం వల్ల వాటి పరిస్థితి ఘోరంగా మారింది. ఈ తరుణంలో కర్ణాటకలోని హ్యాపీ ఫాల్స్ ఫౌండేషన్ సంస్థ.. మూగజీవాలకు బాసటగా నిలిచింది. రోజుకు సుమారు 1200లకు పైగా వీధి కుక్కలకు ఆహారాన్ని అందిస్తున్నారు ఆ సంస్థ అధ్యక్షురాలు రేఖ మోహన్.
వృత్తి రీత్యా సాఫ్ట్వేర్ ఉద్యోగి అయిన ఈమె కర్ణాటకలోని బసవనగుడి, ఎన్ఆర్కాలనీ, హనుమంతనగర్, సీతా సర్కిల్, పద్మనాభ నగర్, బనశంకరి, త్యాగరాజ నగర్, కేఆర్ మార్కెట్‌తో పాటు ఇతర ప్రాంతాల్లోని మూగజీవాలకు ఆహారాన్ని అందిస్తున్నారు. ఈ ప్రాంతాల్లో ఉన్న సుమారు 28 జంతువులు, 17 శునకాలు, 12 పిల్లులు, పక్షులు, ఇతర మూగజీవాలకు భోజనాన్ని సమకూర్చుతున్నారు.
వీటి కోసం ప్రతిరోజు 75కేజీల బియ్యం, 60కేజీల చికెన్‌ను వండుకొని తీసుకొని వెళ్తున్నట్లు రేఖ తెలిపారు. దీనికోసం రోజుకు 5 వేల రూపాయలు ఖర్చు అవుతోందని వెల్లడించారు. తాను చేస్తున్న పనిని చూసి ప్రజలు కూడా తనకు సాయం చేస్తున్నట్లు తెలిపిన ఆమె.. లాక్డౌన్ పూర్తి అయ్యే వరకు రోజు మూగజీవాలకు ఆహారం అందించనున్నట్లు స్పష్టం చేశారు.