దేశవ్యాప్త లాక్‌డౌన్‌తో ఓ ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్లడం చాలా కష్టం. అంతర్రాష్ట్ర ప్రయాణమైతే దాదాపు అసాధ్యం. ఇలాంటి పరిస్థితుల్లో మృతదేహాన్ని తరలించేందుకు 4 వేల కిలోమీటర్లు ప్రయాణించింది ఓ అంబులెన్స్. ఆశ్చర్యంగా ఉందా? కానీ నిజం. గుజరాత్ సూరత్‌లో చనిపోయిన వ్యక్తి శవాన్ని అతడి భార్య కోరిక మేరకు తమిళనాడు తిరునల్వేలి జిల్లాకు తరలించారు అధికారులు.
ఏం జరిగింది?
తిరునల్వేలికి చెందిన 58 ఏళ్ల సుబ్బరాజు... 15 సంవత్సరాలుగా సూరత్‌లో ఉంటున్నాడు. బతుకు తెరువుకోసం అక్కడే ఓ రెస్టారెంట్లో పని చేస్తున్నాడు. జీవనం సాఫీగా సాగుతున్న తరుణంలో అనారోగ్య సమస్యలు తలెత్తడం వల్ల ఆసుపత్రిలో చేరిన సుబ్బరాజు ఏప్రిల్ 12న మృతి చెందాడు.
దేశవ్యాప్తంగా లాక్డౌన్ ఉన్న నేపథ్యంలో మృతదేహాన్ని స్వగృహానికి ఎలా తీసుకురావాలో తిరునల్వేలిలో ఉన్న సుబ్బరాజు భార్యకు తెలియలేదు. చివరకు ఆమె జిల్లా కలెక్టర్ శిల్పా ప్రభాకర్‌కు తన పరిస్థితిని విన్నవించుకుంది. ఆమె విజ్ఞప్తిని మన్నించిన జిల్లా కలెక్టర్..ఆ మృతదేహాన్ని తరలించే బాధ్యతను జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ శివగురు ప్రభాకరన్‌కు అప్పగించారు.
సూరత్ నుంచి తిరునల్వేలికి సుబ్బరాజు మృతదేహానికి తీసుకొచ్చేందుకు తొలుత అంబులెన్సు డ్రైవర్ల ఎవరూ ముందుకు రాలేదు. అతి కష్టం మీద చివరకు ఒకరు ఒప్పుకున్నారు. సుబ్బరాజు మరణించిన 4 రోజులకు మృతదేహాన్ని స్వగృహానికి తరలించారు.
"జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సూరత్ జిల్లా పరిపాలనాధికారుల సహాయంతో మృతదేహాన్ని తరలించాము. సూరత్ నుంచి తిరునల్వేలికి దూరం 2 వేల కిలోమీటర్లు. ఆ అంబులెన్సు తిరిగి వెళ్లేందుకు మరో 2 వేల కిలోమీటర్లు ప్రయాణించాలి."
-శివగురు, తిరునల్వేలి అసిస్టెంట్ కలెక్టర్