కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు విధించిన దేశవ్యాప్త లాక్డౌన్ సామాన్యులను ఆపసోపాలు పెడుతోంది. ఇంటికి దూరంగా ఇరుక్కుపోయి.. ఇక్కట్లు పడుతున్నవారు స్వగ్రామాలకు చేరేందుకు సాహసాలే చేస్తున్నారు. త్రిపురకు చెందిన దంపతులు చెన్నైలో చిక్కుకుని.. ఎప్పుడో నిశ్చయించుకన్న కూతురు పెళ్లి చేసేందుకు 3000 కి.మీ అంబులెన్స్‌లో ప్రయాణం చేశారు.
ఇక నేపాల్ నుంచి సైకిల్‌పై ఇంటికి వస్తూ ప్రాణాలే విడిచారు ఇద్దరు భారతీయులు.
అంత దూరం అంబులెన్స్‌లోనే..
త్రిపుర గోమతి జిల్లా, ఉదయ్‌పుర్‌కు చెందిన చంచల్ మజుమ్దార్.. భార్య అషీమాకు చికిత్స చేయించేందుకు చెన్నైలోని ప్రముఖ ఆసుపత్రికి తీసుకొచ్చాడు. చికిత్స పూర్తయినా లాక్‌డౌన్‌తో రవాణా సౌకర్యాలు లేని కారణంగా తిరిగి ఇంటికి వెళ్లలేకపోయారు ఆ దంపతులు. ఊరుకానీ ఊరిలో తిండికి తిప్పలు పడుతూ కాలం గడిపారు. మరోవైపు, వచ్చె నెల కుమార్తె పెళ్లి నిశ్చయమైంది. అందుకే, ఏదేమైనా సరేనని అంబులెన్స్‌లోనే 3,213 కి.మీ ప్రయాణించి ఉదయపుర్కు చేరుకున్నారు.
"మేము అపోలో హాస్పిటల్‌కు వెళ్లాము. అక్కడ నా భార్యకు ఆపరేషన్ జరిగింది. ఆమె ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే సమయానికి లాక్డౌన్ ప్రకటించింది ప్రభుత్వం. అక్కడే ఉండాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. అంతే, కాదు వచ్చే నెల 8వ తేదిన నా కుమార్తె వివాహం ఉంది. అందుకే, అంబులెన్స్ అద్దెకు తీసుకుని ఇంటికి రావలసివచ్చింది."
-మజుమ్దార్
సుదీర్ఘ అంబులెన్స్ ప్రయాణంలో.. తమిళనాడు, ఒడిశా, బంగాల్, అసోం, మేఘాలయా, త్రిపుర సరిహద్దుల్లో ఆసుపత్రి పత్రాలను చూపించాల్సి వచ్చింది మజుమ్దార్. అదే వాహనంలో త్రిపురకు చెందిన మరో పేషంట్‌ను కూడా స్వగ్రామానికి చేర్చారు ఆ దంపతులు.
ప్రస్తుతం ఆ ముగ్గురూ ఉదయ్‌పుర్‌లోని ఓ క్వారంటైన్ కేంద్రంలో ఉన్నారని గోమతి జిల్లా మేజిస్ట్రేట్ తరుణ్ కాంతి దేవ్నాథ్ తెలిపారు.
"ఎన్నో రాష్ట్రాలు, కరోనా ప్రభావిత ప్రాంతాలను దాటి వచ్చారు. కాబట్టి, వారిని మేము నిర్బంధ కేంద్రానికి తరలించాం. వారు గోమతికి చేరుకున్నాక, వారి కుమార్తెను గానీ, ఇతర బంధువులను కానీ కలవలేదు."
- తరుణ్ కాంతి దేవ్నాథ్, గోమతి మేజిస్ట్రేట్
ఇంటికొస్తూ.. మృతి
బిహార్‌లోని మోతీహారికి చెందిన సంతోష్ మహతో ఆయన తండ్రి దీనానాథ్లతో పాటు ముఖేష్ గుప్తా, మున్నా గుప్తాలు నేపాల్‌లోని లలిత్‌పుర్‌లో పాత న్యూస్ పేపర్లను సేకరించే కార్మికులుగా పనిచేసేవారు. లాక్డౌన్ విధించి మూడు వారాలు దాటడం వల్ల ఉన్న డబ్బు కాస్తా ఖర్చయిపోయింది.
దీంతో సైకిల్‌పైనే ఇంటికి చేరుకోవాలని నిశ్చయించుకున్నారు. రెండు సైకిళ్లపై నలుగురూ ప్రయాణం మొదలెట్టారు. సంతోష్, ముఖేష్‌లు ప్రయాణిస్తున్న ఓ సైకిల్ ఝక్రిదాదాలో 150 కి.మీ ఎత్తైన నిటారు కొండలపై నుంచి కిందపడిపోయింది. దీంతో ఇద్దరూ అక్కడిక్కడే మృతి చెందారు. దీనానాథ్, మున్నాలు ఇంటికి చేరుకున్నారు.
ఇదీ చదవండి:కుమార్తె కోసం సాహసం చేసి కానరాని లోకాలకు...