ఉత్తరాఖండ్‌లోని పౌడీ-కోట్ద్వార్ జాతీయ రహదారికి సమీపంలో ఉన్న ఆగ్రోడా కస్బా ప్రాంతంలో ఎలుగుబంట్ల బెడద ఎక్కువైంది. సమీపంలో అడవి నుంచి ఎలుగుబంట్లు వచ్చి మాంసం దుకాణాలపై దాడి చేస్తున్నాయి. అక్కడ ఉన్న కోళ్లు, చేపలను తినేస్తున్నాయి. ఆ తర్వాత దుకాణ పరిసరాల్లో రచ్చరచ్చ చేస్తున్నాయి. దీంతో మాంసం వ్యాపారులు లోబోదిబోమంటున్నారు. అటవీశాఖ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా.. పట్టించుకోవట్లేదని ఆరోపిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలు కావడం వల్లే అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తమ సమస్యకు పరిష్కార చూపాలని వేడుకుంటున్నారు.
తల్లి చెంతకు చిరుత పిల్లలు..
మహారాష్ట్రలోని నాసిక్ వాడిచె రణ్‌లో అటవీ అధికారులు.. స్థానికులు తీసుకున్న జాగ్రత్తల వల్ల మూడు చిరుత పిల్లలు సురక్షితంగా తల్లి చెంతకు చేరాయి. వాడిచె రణ్‌లో చెరకు పంట కోస్తున్న కూలీలకు మూడు చిరుతపులి పిల్లలు కనిపించాయి. వెంటనే వారు అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. అక్కడకు చేరుకున్న అటవీ సిబ్బంది చిరుతలకు వైద్య పరీక్షలు నిర్వహించారు.
అనంతరం వాటిని ఇతర జంతువుల కంట పడకుండా చెరకు తోటలోని సురక్షిత ప్రదేశంలో ఉంచారు. పిల్లల కోసం తల్లి చిరుత వచ్చే అవకాశం ఉండటం వల్ల కొన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత అక్కడ నుంచి వెళ్లిపోయారు. దాదాపు 8 గంటల తర్వాత అక్కడకు చేరుకున్న తల్లి చిరుత పిల్లల్ని తీసుకుని వెళ్లిపోయింది. ఈ సంఘటన మొత్తం సీసీటీవీలో రికార్డైంది.
గ్రామంలో చిరుత కలకలం..
ఉత్తర్‌ప్రదేశ్‌లోని షాజహాన్‌పుర్ జిల్లాలో చిరుతపులి కలకలం సృష్టించింది. కాంట్ ప్రాంతంలోని ఓ చిరుత.. వీధుల్లో తిరుగుతూ భయభ్రాంతులకు గురిచేసింది. స్థానిక సీసీటీవీలో చిరుత సంచార దృశ్యాలు రికార్డు అయ్యాయి.
సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. చిరుతను పట్టుకునేందుకు బోనును ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతంలో గస్తీ కూడా కాస్తున్నారు. రాత్రి వేళల్లో ఎవరూ బయటకు రావద్దని అటవీశాఖ అధికారులు హెచ్చరించారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం చిరుత సంచారంతో ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది.