Bangalore Demolition Drive : నొయిడాలోని ట్విన్ టవర్స్ మాదిరిగానే బెంగళూరులో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామని హెచ్చరించారు రెవెన్యూ మంత్రి ఆర్. అశోక్. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు బెంగళూరు నగరం పూర్తిగా మునిగిపోయింది. ఈ నేపథ్యంలో బృహత్ బెంగళూరు మహానగర పాలికె చర్యలకు ఉపక్రమించింది. నగరంలో వరద నీరు వెళ్లకుండా నిర్మించిన అక్రమాల కూల్చివేత ప్రక్రియను చేపట్టింది. మహదేవెపుర జోన్ పరిధిలోని శాంతినికేతన లేఔట్ సహా పలు ప్రాంతాల్లోని ఈ అక్రమాల తొలగింపును చేపట్టింది బృహత్ బెంగళూరు మహానగర పాలికె.
"సరైన పత్రాలు లేకపోతే ఎంతటి వారినైనా వదిలిపెట్టొదని డిప్యూటీ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేశాను. చిన్నా పెద్దా తేడా లేకుండా తొలగించాలని చెప్పా. చాలా ఐటీ సంస్థలు అక్రమ నిర్మాణాలు చేపట్టాయి. సుమారు 30 సంస్థల జాబితాను తయారు చేసి తొలగించాలని ఆదేశాలిచ్చాం."
ఆర్. అశోక్, రెవెన్యూ శాఖమంత్రి
వచ్చే వర్షాకాలం నాటికి అక్రమ నిర్మాణాలు లేకుండా చేస్తామని చెప్పారు మంత్రి అశోక్. వర్షం ఆగిపోగానే.. అక్రమాలను తొలగించకుండా గత ప్రభుత్వాలు డ్రామాలు ఆడాయని అన్నారు. ఈ అక్రమ నిర్మాణాల వెనుక ఎవరున్నా వదిలిపెట్టవద్దని ప్రభుత్వం ఆదేశించిందని అధికారులు తెలిపారు. అయితే, ధనవంతుల చేపట్టిన అక్రమ నిర్మాణాలు కూల్చకుండా పేద వారి ఇళ్లను కూల్చివేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. సరైన శాస్త్రీయ సర్వే, నోటీసులు లేకుండానే నిర్మాణాలను తొలగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చదవండి: ఊళ్లోకి 10 అడుగుల తాచుపాము.. అంతా హడల్.. చివరకు...
ఈ చిన్నోడు ఎంత 'ముద్దు'గా సారీ చెప్పాడో.. నెట్టింట వీడియో వైరల్