Azadi Ka Amrit Mahotsav Gaade Chinnapu Reddy: గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెంలో 1864లో గాదె చిన్నపరెడ్డి జన్మించారు. తండ్రి సుబ్బారెడ్డి, తల్లి లింగమ్మల నాలుగో సంతానం. వారిది సంప్రదాయ వ్యవసాయ కుటుంబం. చిన్ననాటి నుంచీ తన చుట్టూ జరిగే ప్రతి విషయాన్నీ చిన్నపరెడ్డి నిశితంగా గమనించేవారు. పంటల ధరలు, రైతుల సమస్యలపై తోటివారితో చర్చించేవారు. ఎక్కడికైనా, ఎంతదూరమైనా గుర్రంపైనే వెళ్లేవారు. చెన్నైకి సైతం గుర్రం పైనే వెళ్లి, సంతల్లో విత్తనాలు, వ్యవసాయ పరికరాలను సేకరించేవారు. 1907లో చెన్నై వెళ్లినప్పుడు అక్కడ జరిగిన ఓ సమావేశంలో ‘స్వరాజ్యం నా జన్మహక్కు’ అని నినదించిన బాలగంగాధర తిలక్ ప్రసంగం విన్నారు. దాంతో ఆంగ్లేయుల కారణంగా దేశం ఎదుర్కొంటున్న సమస్యలపై చిన్నపరెడ్డికి అవగాహన ఏర్పడింది. అదే ఉత్సాహంతో గ్రామానికి తిరిగొచ్చి, స్థానికులను చైతన్యం చేశారు. 'వందేమాతరం' నినాదాన్ని వారికి పరిచయం చేశారు. మన ప్రాంతాన్ని మనమే పాలించుకుంటే ప్రజలకు మేలు జరుగుతుందని స్పష్టంచేశారు. అలా జనానికి దగ్గరైన చిన్నపరెడ్డి, పోలీసులకు మాత్రం శత్రువయ్యారు.
ఎద్దులు బెదిరి తొక్కిసలాట
పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం కోటప్పకొండలోని ప్రఖ్యాత త్రికూటేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. దీనికి చుట్టుపక్కల గ్రామాల నుంచి వేల మంది తరలివస్తారు. 1909 ఫిబ్రవరి 18న జాతర ఘనంగా జరుగుతోంది. భారీ ప్రభలు, అందంగా అలంకరించిన ఎద్దులతో రైతులు ప్రదర్శన నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీ. చిన్నపరెడ్డి సైతం తమ సొంతూరు నుంచి ఎద్దుల బండికి దాదాపు 60 అడుగుల ఎత్తున్న ప్రభను కట్టుకుని వచ్చారు. జనసందడిలో ఆయన ఎద్దులు బెదిరి, స్వల్ప తొక్కిసలాట జరిగింది. అప్పటికే చిన్నపరెడ్డిపై కోపంతో ఉన్న పోలీసులు దీన్ని అవకాశంగా తీసుకున్నారు. వెంటనే ఎద్దులను తీసుకుని జాతర నుంచి వెళ్లిపోవాలని, లేదంటే వాటిని కాల్చేస్తామంటూ హెచ్చరించారు. తన తర్వాతే తన ఎద్దులను కాల్చాల్సి ఉంటుందని చిన్నపరెడ్డి పోలీసులకు ఎదురెళ్లారు. పోలీసులు ఎద్దులను తుపాకీతో కాల్చేశారు.
కోపోద్రిక్తుడైన చిన్నపరెడ్డి పోలీసులను ఎదిరించగా.. ఆయన్ని అరెస్టు చేశారు. జాతర కోసం తాత్కాలికంగా తాటాకులతో వేసిన పోలీసుస్టేషన్‌లో బంధించారు. విషయం తెలుసుకున్న ప్రజలు చిన్నపరెడ్డిని వదిలేయాలని ఆందోళనకు దిగారు. పోలీసులు తుపాకులు పేల్చగా ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. తీవ్ర ఆగ్రహానికి గురైన ప్రజలు 'వందేమాతరం.. మనదే రాజ్యం' అంటూ నినదిస్తూ ముందుకురికారు. చిన్నపరెడ్డిని విడిపించుకుని, తాటాకుల ఠాణాకు నిప్పు పెట్టి, ఇద్దరు కానిస్టేబుళ్లను మంటల్లోకి విసిరేసి, చంపేశారు. మిగిలిన వారిని తరిమికొట్టారు. దాంతో పోలీసులు చిన్నపరెడ్డితోపాటు దాదాపు వంద మందిపై కేసులు పెట్టారు.
ఏకంగా 21 మందికి ఉరిశిక్ష
మద్రాసు ప్రావిన్సులో సంచలనం సృష్టించిన ఈ కేసుపై గుంటూరు సెషన్స్ కోర్టులో విచారణ జరిగింది. వాదోపవాదాల తర్వాత న్యాయమూర్తి 21 మందికి ఉరిశిక్ష, 24 మందికి కఠిన కారాగార శిక్షలు విధించాడు. దీనిపై చిన్నపరెడ్డి మద్రాసు హైకోర్టుకు వెళ్లారు. సంఘటనకు పూర్తి బాధ్యత తానే వహిస్తున్నానని, కావాలంటే తనను ఉరితీసి, మిగిలిన వారిని వదిలి వేేయాలని కోర్టుకు విన్నవించగా న్యాయమూర్తి 1910 ఆగస్టు 13న తీర్పు ఇచ్చారు. చిన్నపరెడ్డికి మరణశిక్ష, 21 మందికి ద్వీపాంతర శిక్ష వేశారు. ఉద్యమకారులు ఆందోళనలకు దిగకుండా చిన్నపరెడ్డిని రాజమహేంద్రవరం జైలులో వెంటనే ఉరితీశారు. ఆయన త్యాగం ప్రజలను తీవ్రంగా కదిలించింది. వీరుడి పోరాట గాథను అప్పట్లో బాగా ప్రాచుర్యంలో ఉన్న బుర్రకథ కళారూపంగా మరల్చారు. అది 'సై సైరా చిన్నపరెడ్డీ.. నీ పేరే బంగరు కడ్డీ' అంటూ ఇప్పటికీ ఉమ్మడి గుంటూరు ప్రజల నాలుకల మీద కదలాడుతూనే ఉంది.
ఇదీ చదవండి: బ్రిటిషర్ల ఆధిపత్యం.. భారతీయుల కులపైత్యం.. అతడి 'బాల్'కు ఔట్!