ETV Bharat / bharat

తన గొంతుకతో స్వాతంత్య్రోద్యమ కాంక్షను రగిల్చిన 'దేశబాంధవి'

author img

By

Published : Jul 8, 2022, 4:51 AM IST

Updated : Jul 8, 2022, 6:33 AM IST

స్వరాజ్య సమరంలో జాతీయ నేతల ప్రసంగాలు సామాన్య ప్రజల్లో చైతన్య జ్వాలల్ని రగిలించాయి. నాయకుల తూటాల్లాంటి మాటలతో ప్రభావితులైనవారెందరో స్వాతంత్య్ర సంగ్రామాన ముందుకురికి పోరాడారు. అలాంటి సమయంలో ఓ మహిళ గళం ప్రళయ నినాదమై గర్జించింది. ఆమె వాగ్దాటికి తాళలేక బ్రిటిష్‌ సర్కారు అధికారులు, పోలీసులు జారుకునేవారు. దేశబాంధవి బిరుదు పొందిన ఆమే.. దువ్వూరి సుబ్బమ్మ.

ఆజాదీ
ఆజాదీ

ద్రాక్షారామంలోని సనాతన సంప్రదాయ కుటుంబంలో 1880 నవంబరు 15న జన్మించిన దువ్వూరి సుబ్బమ్మ పదకొండో ఏటే... బాల వితంతువుగా మారారు. చిన్నతనంలోనే భర్తను కోల్పోయి కుంగిపోతున్న ఆమెకు.. తిరుపతి వేంకటకవుల్లో ఒకరు, సమీప బంధువు అయిన చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి చేరదీసి విద్యాబుద్ధులు నేర్పారు. ఆయన ప్రోత్సాహంతో తెలుగు, సంస్కృత భాషల్లో పట్టు సంపాదించి గొప్పవక్తగా మారారు సుబ్బమ్మ. స్వరాజ్య సాధనకు మహాత్మాగాంధీ సాగిస్తున్న పోరాటం గురించి తెలుసుకుని ఉప్పొంగిపోయారు. కుటుంబసభ్యులను ఒప్పించి స్వరాజ్య సమరంలో దూకారు. తన వాక్పటిమతో నారీ లోకాన్ని కదిలించారు. "ఉరిమింది భరతజాతి.. రగిలింది ప్రజాశక్తి.. మోగింది విజయభేరి.. ఎగిరింది జాతీయ జెండా" అంటూ ఊరూరా తిరిగి ప్రజల్లో స్వాతంత్య్రోద్యమ కాంక్షను రగిలించారు. దేశభక్తి గేయాలు, పాటలు పాడుతూ, ఇతిహాసాల్లోని సూక్తులను ఉటంకిస్తూ.. సూటిగా, చురుగ్గా, కరుగ్గా ఆమె చేసే ప్రసంగాలు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునేవి. కేవలం సుబ్బమ్మ ప్రసంగం వినడానికే సభకు ఎంతోమంది హాజరవుతుండేవారంటే అతిశయోక్తి కాదు. 1921 కాకినాడ కాంగ్రెస్‌ సమావేశంలో సంపూర్ణ స్వాతంత్య్రం కోసం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని బలపరుస్తూ సుబ్బమ్మ చేసిన అనర్గళ ప్రసంగం.. ఆ సభకు అధ్యక్షత వహించిన టంగుటూరి ప్రకాశం పంతులుతో సహా ప్రతిఒక్కరినీ మంత్రముగ్ధులను చేసింది.

మైకులు లేని ఆ రోజుల్లో ఆమె గళం కంచుకంఠమై మోగేది. అయిదారు వేల మంది పాల్గొన్న సభల్లోనూ ఎంతదూరంలో ఉన్నవారికైనా.. ఆమె ప్రసంగం ఓ లౌడ్‌ స్పీకర్‌గా ఎంతో స్పష్టంగా వినిపించేది. సుబ్బమ్మ ఉపన్యాసం జనానికి వినిపించకూడదన్న ఉద్దేశంతో బ్రిటిష్‌ పోలీసులు.. ఆమె ప్రసంగిస్తున్న చోటుకు వెళ్లి డప్పులు, డబ్బాలు కొడుతుండేవారు. సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్న ఆ ధీశాలిని ఓ రోజు ఆంగ్లేయ పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. "ఓ అమ్మా... తప్పు ఒప్పుకో.. క్షమాపణ చెప్పుకో.. క్షమాపణ చెబితే నిన్ను వదిలిపెడతాం" అన్నాడు అప్పటి బ్రిటిష్‌ కలెక్టరు. ఆ మాటలను అసహ్యించుకున్న సుబ్బమ్మ "ఛీ.. ఛీ..! నా కాలిగోరు కూడా ఆ పనిచేయదు" అని దీటైన సమాధానం చెప్పి తన పౌరుషమేంటో చూపించారు.

ఆరు నెలలపాటు కారాగారంలో గడిపారేగానీ తెల్లదొరలు ఇచ్చిన ఆ అవకాశాన్ని అస్సలు వినియోగించుకోలేదు ఆ యోధురాలు. స్వాతంత్య్ర సంగ్రామంలో ఎన్నోసార్లు జైలుకెళ్లిన సుబ్బమ్మ అక్కడా ఉపన్యసిస్తూ, పాటలు పాడుతూ ప్రతిఒక్కరిలో జాతీయభావాన్ని పెంపొందించేవారు. ఈటెల్లాంటి మాటలతో జైలు అధికారులను హడలెత్తిస్తూ కారాగారంలో ఉన్నవారందరికీ అవసరమైన సదుపాయాలు కల్పించడంలోనూ విజయం సాధించారు.
స్వాతంత్య్ర సమరంలో చురుగ్గా పాల్గొన్న సుబ్బమ్మ మహాత్ముడి స్ఫూర్తితో విదేశీ, వస్తు బహిష్కరణ ఉద్యమంలోనూ తనవంతు పాత్ర పోషించారు. తాను ఖద్దరు దుస్తులను ధరించడమే కాకుండా చేనేత వస్త్రాల మూటను తలపై పెట్టుకుని ఊరూరా తిరుగుతూ విక్రయిస్తుండేవారు.

ఓ సారి కొందరు మహిళలు.. ఖద్దరు చీర బరువు మోయలేకపోతున్నామని సుబ్బమ్మకు మొరపెట్టుకున్నారు. దీంతో.. "గుండెత్తుల బరువున్న మొగుళ్లను మోస్తున్నారు. ఉద్యమం కోసం ఈ మాత్రం కోకలు బరువయ్యాయా.. మోయలేరా?" అంటూ మహిళలను తనదైన శైలిలో మందలించి వారిలో 'చేనేత' స్ఫూర్తిని నింపారు. చదువుతోనే చైతన్యం సాధ్యమవుతుందని గుర్తించిన సుబ్బమ్మ రాజమండ్రిలో 'సనాతన స్త్రీ విద్యాలయం' పేరిట అన్ని వసతులతో బాలికల పాఠశాలను ఏర్పాటు చేసి సొంతంగా నిర్వహించారు. స్వాతంత్య్రం అనంతరం 16 ఏళ్లపాటు ఏఐసీసీ సభ్యురాలిగా కొనసాగిన ఆమె తన యావదాస్తిని ఉద్యమం కోసమే ధారపోశారు. జీవిత చరమాంకంలో సుబ్బమ్మను పరామర్శించడానికి 1954లో అప్పటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు స్వయాన కడియానికి వెళ్లారు. పోరాట పటిమ ప్రదర్శించిన ఆమెకు కాకినాడలో 1923లో నిర్వహించిన కాంగ్రెస్‌ సభలో దేశబాంధవి అనే బిరుదును ఇచ్చి గౌరవించారు. 1964 మే 31న కన్నుమూసిన ఆమె స్మారకార్థం రాజమండ్రి స్వాతంత్య్ర సమరయోధుల పార్కులో విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.

ఇదీ చూడండి: బెడిసికొట్టిన 'విభజన మంత్రం'.. మరింత బలపడిన భారతీయుల ఐక్యత

Last Updated : Jul 8, 2022, 6:33 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.