Azadi ka amrit mahotsav: బోల్ష్‌విక్ విప్లవంతో రష్యాలో అధికారంలోకి వచ్చిన కమ్యూనిస్టుల విజయాలపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. మనదేశంలోనూ ఏఐటీయూసీ (1920), సీపీఐ (1925)ల కార్యకలాపాలతో కమ్యూనిస్టు, సోషలిస్టు భావజాలం వ్యాప్తి చెందుతోంది. కార్మికులు సమ్మెలు చేస్తున్నారు. ఇక్కడి నాయకులు బెర్లిన్, మాస్కోలకు వెళుతూ కమ్యూనిస్టు పార్టీ చర్చల్లో పాల్గొంటున్నారు. ఆ స్ఫూర్తితో మీరట్ (ప్రస్తుత మేరఠ్)లో వర్కర్స్ అండ్ పెజంట్స్ పార్టీని ప్రారంభించారు. కార్మికులతోపాటు కర్షకులనూ సంఘటితం చేస్తున్నారు. అదే సమయంలో భారత్‌లో కార్మికోద్యమం తీరుతెన్నులను పరిశీలించేందుకు బ్రిటన్ నుంచి కమ్యూనిస్టు నేతలు ఫిలిప్ స్ప్రాట్, బెంజిమన్ ఫ్రాన్సిస్ బ్రాడ్లే, హచిసన్ వచ్చారు.
బ్రిటన్ ప్రభుత్వం వెన్నులో వణుకు: భారత్‌లో శ్రామికులు, రైతులు క్రమంగా ఒక్కటవుతుండటంతో ఆంగ్లేయ ప్రభుత్వం భయపడింది. కమ్యూనిస్టు భావజాల వ్యాప్తిని అడ్డుకోవాలని నిర్ణయించింది. కేవలం అనుమానంతోనే పోలీసులు ఎవరినైనా అదుపులోకి తీసుకునే ప్రజారక్షణ బిల్లును, ఆస్తులను జప్తు చేసుకోవడానికి కార్మిక వివాదాల పరిష్కార బిల్లును తెచ్చింది. అనంతరం పోలీసులు 1929 మార్చిలో అప్పటి బొంబాయి, కలకత్తా, మద్రాసు, పంజాబ్, పూనా, యునైటెడ్ ప్రావిన్స్‌లలో విస్తృతంగా గాలించారు. మొత్తం 32 మంది కార్మిక సంఘాల నేతలు, కాంగ్రెస్ నాయకులు సహా ముగ్గురు బ్రిటిషర్లనూ అరెస్టు చేశారు. అందర్నీ మీరట్ జైలుకు తరలించారు. నిందితుల్లో ఎస్.ఎ.డాంగే, షౌకత్ అహ్మద్, ముజఫర్ అహ్మద్, కె.ఎన్.సెహగల్, ఎస్.ఎస్.జోషి, షౌకత్ ఉస్మానీ, ఎ.ప్రసాద్, కిశోరీలాల్ ఘోష్, డి.ఆర్.తెండ్గీ, డి.గోస్వామి తదితరులతోపాటు ఫిలిప్ స్ప్రాట్, బెంజిమన్ ఫ్రాన్సిస్ బ్రాడ్లే, హచిసన్ ఉన్నారు. భారత్‌లో రైల్వేలో సమ్మె చేయించారని, ఆంగ్లేయ పాలనను కూలదోయడానికి కుట్ర పన్నారని వీరిపై అభియోగాలు మోపారు.
సుదీర్ఘ కాలం విచారణ: బ్రిటిష్ ఇండియా చరిత్రలోనే అత్యంత ఎక్కువ కాలం విచారణ సాగిన కేసు ఇది. దీన్ని నిరూపించేందుకు ప్రభుత్వం అప్పట్లోనే దాదాపు రూ.16 లక్షలను ఖర్చు చేసింది. 1929 మార్చి 15న పెట్టిన కేసులో... 1933 జనవరి 17న తీర్పు వెలువడింది. నిందితుల్లో అయిదుగురిని విడుదల చేయగా వారిలో ఒకరు కేసు నడుస్తుండగానే మరణించారు. 27 మందిని దోషులుగా తేల్చారు. ముజఫర్ అహ్మద్‌కు యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. మిగిలిన వారికి 12 ఏళ్ల నుంచి మూడేళ్లపాటు జైలుశిక్షలు వేశారు. నిందితులంతా అప్పటికే నాలుగున్నరేళ్లు జైలులోనే మగ్గినా ఆ కాలాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. తీర్పుపై అప్పీలుకు వెళ్లగా... నాటి అలహాబాద్ హైకోర్టు తొమ్మిది మందిపై ఆరోపణలను కొట్టేసింది. మిగిలిన 18 మంది శిక్షలను తగ్గించింది. చివరికి వారంతా 1933 నవంబరులో విడుదలయ్యారు.
అన్ని వైపుల నుంచి విమర్శలు: నిందితులకు న్యాయ సహాయం చేయడానికి జ్యూరీని నియమించకపోవడం, విచారణ సాగినన్ని రోజులూ వారిని జైలులోనే ఉంచడంతో అమెరికా, ఇంగ్లండ్, ఫ్రాన్స్, రష్యా, జర్మనీ తదితర దేశాల నుంచి విమర్శలు ఎదురయ్యాయి. ముఖ్యంగా ప్రఖ్యాత శాస్త్రవేత్త అల్బర్ట్ ఐన్‌స్టీన్, ప్రసిద్ధ రచయిత హెచ్.జి.వేల్స్, సోషలిస్టు నాయకుడు హెరాల్డ్ జె.లాస్కీ తమ నిరసన తెలిపారు.
కోర్టు హాలు నుంచే భావజాల వ్యాప్తి: ఇండియాలో కమ్యూనిజం వ్యాప్తిని అడ్డుకునేందుకు ఆంగ్లేయులు వేసిన ఎత్తుగడ ఫలించలేదు. బాధితులను మహాత్మాగాంధీ, నెహ్రూ... మీరట్ జైలులో పరామర్శించడంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. నిందితులు కోర్టు హాలులో... ఆంగ్లేయ ప్రభుత్వ దమనకాండ, దేశంలో కార్మికుల దుస్థితి, తమ పార్టీ లక్ష్యాలపై సుదీర్ఘంగా వివరణలు ఇవ్వడం, దేశవిదేశీ మీడియాలో అవన్నీ ప్రచురితం కావడంతో కమ్యూనిస్టు సిద్ధాంతాలు జనబాహుళ్యంలోకి విస్తృతంగా చొచ్చుకెళ్లాయి.
ఇదీ చదవండి: బ్రిటిషర్లను గజగజ వణికించిన కేరళ సింహం