two brothers death: అన్నదమ్ముల అనుబంధానికి అద్దం పట్టే అరుదైన ఘటన రాజస్థాన్ సిరోహిలో జరిగింది. బాల్యం నుంచి కలిసిమెలిసి జీవించిన ఇద్దరు సోదరులు నిమిషాల వ్యవధిలోనే తుది శ్వాస విడిచారు. మరణంలో కూడా తమ అనుబంధాన్ని కొనసాగించారు. ఈ విషయం స్థానికంగా చర్చనీయాంశమైంది. అన్నదమ్ములకు ఒకరిపై మరొకరికి ఉన్న ప్రేమను చూసి గ్రామస్థులు ఆశ్చర్యపోయారు.
ఈ ఇద్దరు వృద్ధ సోదరుల పేర్లు రావతారామ్, హీరారామ్ దేవాసీ. చిన్నప్పటి నుంచి ఒక్క రోజు కూడా ఒకరిని విడిచి మరొకరు ఉండలేదు. సాధారణంగా పెళ్లిళ్లు అయ్యాక అన్నదమ్ములు వేరు పడటమో, కుటుంబ కలహాలు రావడమో జరుగుతుంది. కానీ వీరు మాత్రం ఇంకా దగ్గరయ్యారు. ఇద్దరి వివాహాలు కూడా ఒకే రోజు జరగడం గమనార్హం. ఇప్పుడు మరణం కూడా ఒకే రోజు వచ్చింది. 15 నుంచి 20 నిమిషాల వ్యవధిలో ఇద్దరు తుది శ్వాస విడిచారు. వీరి వయసు 75-90 ఏళ్ల మధ్య ఉంటుందని కుటుంబసభ్యులు తెలిపారు.
ఇద్దరి కుటుంబాల్లో మొత్తం 11మంది పిల్లలు ఉన్నారు. ఇరువురు ఎంతో ఆప్యాయంగా ఉండేవారని, ఒకరి బాగోగులు మరొకరు చూసుకునేవారని రావతారామ్ కుమారుడు తెలిపాడు. తన తండ్రి చనిపోయిన కాసేపటికే అది తట్టుకోలేక బాబాయ్ కూడా మరణించాడని పేర్కొన్నాడు. ఇద్దరివీ సహజ మరణాలేనని చెప్పాడు. ఇద్దరి పెళ్లిళ్లు ఒకే రోజు జరగడం, మరణం కూడా ఓకే రోజు రావడం యాదృచ్ఛికం అన్నాడు.
ఇదీ చదవండి: బతికున్న బల్లిని కసకసా నమిలి మింగేసి..