Amarnath yatra 2022: జమ్ముకశ్మీర్‌లో అమర్‌నాథ్ యాత్ర గురువారం ప్రారంభమైంది. నున్నవాన్ బేస్ క్యాంప్ నుంచి 2,750 మంది యాత్రికులు మంచు లింగాన్ని దర్శించుకునేందుకు బయలుదేరారు. మొదటి బ్యాచ్ కింద మొత్తం 4,890 మంది యాత్రికులు జమ్మూ బేస్ క్యాంప్ నుంచి నున్వాన్ బేస్ క్యాంప్‌కు తరలివచ్చారు. జమ్ముకశ్మీర్ గవర్నర్ మనోజ్ సిన్హా వర్చువల్‌గా లింగాన్ని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అమర్‌నాథ్ క్షేత్రాన్ని చేరుకునేందుకు మూడు రోజుల సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు. 43 రోజులపాటు కొనసాగే ఈ యాత్ర రక్షాబంధన్ రోజున (ఆగస్టు 11) ముగియనున్నట్లు శ్రీ అమర్‌నాథ్ దేవాలయ బోర్డు ఇప్పటికే స్పష్టం చేసింది. మూడేళ్ల తర్వాత మళ్లీ అనుమతించడం వల్ల భారీ ఎత్తున యాత్రికులు తరలివచ్చారు.
మరోవైపు యాత్రలో ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమైతే వెంటనే స్పందించేందుకు 70 పడకల ఆస్పత్రిని బల్తాల్ బేస్ క్యాంపు వద్ద ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఎక్స్‌రే, ఆల్ట్రాసౌండ్, ఆక్సిజన్ వార్డులు, ఐసీయూ, ఫార్మసీ, ల్యాబ్‌ల సౌకర్యాలు ఉన్నాయన్నారు. బల్తాల్ చాందన్వారీ మార్గాల్లో 135 అంబులెన్సులను కూడా సిద్ధంగా ఉంచామని పేర్కొన్నారు. ఈసారి 'స్వచ్ఛ అమర్‌నాథ్ యాత్ర' లక్ష్యంగా పరిశుభ్రతపై దృష్టి కేంద్రీకరిస్తామని యాత్ర ఏర్పాట్లను పరిశీలించిన లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా వెల్లడించారు.
గత రెండు, మూడేళ్లుగా అమర్‌నాథ్ యాత్ర పూర్తిస్థాయిలో కొనసాగడం లేదు. ఆర్టికల్ 370 రద్దుతో 2019లో అమర్‌నాథ్ యాత్ర మధ్యలోనే రద్దయ్యింది. అనంతరం దేశంలో కొవిడ్ విస్తృతి పెరగడంతో 2020, 2021ల్లోనూ యాత్ర చేపట్టలేదు. ప్రస్తుతం కొవిడ్ ఉద్ధృతి నియంత్రణలో ఉండడంతో ఈ యాత్రను యథావిధిగా కొనసాగించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. మూడేళ్ల విరామం తర్వాత యాత్ర మొదలు కానుండడంతో భక్తుల సంఖ్య భారీగా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఇదిలాఉంటే, దక్షిణ కశ్మీర్‌లోని హిమాలయాల్లో దాదాపు 3880 మీటర్ల ఎత్తైన ప్రదేశంలో ఉన్న అమర్‌నాథుడి దర్శనం కోసం దేశవ్యాప్తంగా ఏటా భారీ ఎత్తున భక్తులు తరలివస్తుంటారు. మొత్తం 43 రోజుల పాటు ఈ యాత్ర జరుగుతుంది. కశ్మీర్‌లో ఉగ్రవాద ముప్పు ఉన్న నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత నడుమ ఈ యాత్ర జరగనుంది.
ఇదీ చూడండి : 'మరుగుదొడ్ల స్కాం'.. 40లక్షల మంది రెండోసారి దరఖాస్తు!