All India Association of Chit Funds on AP CID ADG Comments: మార్గదర్శి చిట్‌ఫండ్ సంస్థ విషయంలో ఏపీ సీఐడీ అధికారులు వ్యవహరిస్తున్న తీరును ఆలిండియా అసోసియేషన్ ఆఫ్ చిట్‌ఫండ్స్ తూర్పారబట్టింది. ఏపీ సీఐడీ ఏడీజీ ఎన్.సంజయ్ బుధవారం దిల్లీలో విలేకర్ల సమావేశం పెట్టి, విడుదల చేసిన పత్రికా ప్రకటనలోని అంశాలను ఖండించింది. తమకు తెలిసినంతవరకు మార్గదర్శి సంస్థ కేంద్ర చట్టాలు, రాష్ట్రాల నిబంధనలకు కఠినంగా కట్టుబడి ఉంటుందని, అలాంటి సంస్థను ప్రజల డబ్బును దుర్వినియోగం చేసిన సహారా, శారదా చిట్స్ లాంటి సంస్థలతో పోల్చడం బాధాకరమని పేర్కొంది. సమృద్ధమైన ఆస్తులతో ఉన్న మార్గదర్శి సంస్థ ప్రజాధనంతో పారిపోవడం అసాధ్యమని స్పష్టం చేసింది. ఒకవేళ తప్పులు జరిగినట్లు భావిస్తే జోక్యం చేసుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొంది.
సమస్య ఉంటే సరిదిద్దాలి తప్పితే ఎలుకను చంపేందుకు ఇంటిని తగలబెట్టేలా వ్యవహరించడం సరికాదని హితవు పలికింది. ఈ మేరకు ఆలిండియా అసోసియేషన్ ఆఫ్ చిట్‌ఫండ్స్ తరఫున సలహాదారు టీఎస్ శివరామకృష్ణన్ గురువారం దిల్లీలో పత్రికా ప్రకటన విడుదల చేశారు. దాని సారాంశమిదీ..‘ఏపీ సీఐడీ అదనపు డైరెక్టర్ దిల్లీలో జారీ చేసిన పత్రికాప్రకటనకు సమాధానంగా ఈ ప్రకటన చేస్తున్నాం. చిట్‌ఫండ్స్‌ను చెడుకోణంలో చూపడం మాకు చాలా బాధ కలిగించింది. ఆ పత్రికా ప్రకటనలో ఉపయోగించిన భాష చాలా తీవ్రంగా ఉంది. ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించే సంస్థ ఏదైనా ఉల్లంఘనకు పాల్పడిందనుకుంటే దాన్ని సరిదిద్దడమే పరిష్కారం. ఆర్‌బీఐ అనుసరించే విధానం కూడా ఇదే. అంతే తప్ప ఇలా కఠిన చర్యలు తీసుకోవడం, ప్రచారం చేయడం లాంటిది ఉండదు. చందాదారుల్లో భయాందోళనలు రేకెత్తించడం వల్ల మీరు ఆరోపిస్తున్న నష్టం మరింత వేగంగా జరుగుతుందన్నదే మా ఆందోళన.
అలాంటి సంస్థలతో పోలికేంటి?: చట్టబద్ధంగా రిజిస్టరయిన చిట్ కంపెనీలను.. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన సహారా, శారదా, సత్యం లాంటి పోంజీ, మల్టీలెవెల్ మార్కెటింగ్ కంపెనీలతో సీఐడీ పోల్చడం బాధాకరం. ఆ కేసులకు, దీనికి ఏ మాత్రం సంబంధం లేదు. చిట్‌ఫండ్ సంస్థలు చందాదారుల నుంచి తీసుకొనే మొత్తం ఎట్టి పరిస్థితుల్లోనూ డిపాజిట్స్ కిందికి రావు. చిట్‌ఫండ్ చట్టంలో ఏదైనా ఉల్లంఘన జరిగిందని తెలిస్తే జోక్యం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. అది మా బాధ్యత కూడా. నాన్‌ప్రైజ్డ్ చందాదారులు భవిష్యత్తులో చెల్లించాల్సిన బకాయిలకు సంబంధించిన మొత్తాన్ని ఇవ్వడం లేదన్న ఆరోపణ గురించి చెప్పాలనుకుంటున్నాం.
చిట్‌ఫండ్ సంస్థలు మిసిలేనియస్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల పరిధిలోకి వస్తాయి. చిట్ చట్టం ప్రకారం చిట్ నిర్వాహకుల సొంత నిధులు, నెలవారీ టర్నోవర్ 1:10 నిష్పత్తిలో ఉండాలి. చిట్‌ఫండ్ అన్నది పరస్పర సహకార సూత్రంపై పనిచేస్తుంది. చిట్ ప్రమోటర్‌కు మిగిలేది 5% కమీషన్, ఎఫ్‌డీఆర్‌లపై వచ్చే వడ్డీలు మాత్రమే. చిట్ పాడుకోని వారితోపాటు మిగతా చందాదారుల నుంచి వసూలు చేసిన మొత్తాన్ని ప్రతి నెలా చిట్ పాడుకున్న వారికి చెల్లిస్తారు. ఆ తర్వాత ఫోర్‌మన్ చేతిలో ఏమీ ఉండదు. పాట పాడుకోని చందాదారుల నుంచి రావాల్సిన మొత్తం, పాడుకున్నవారి నుంచి రావాల్సిన బకాయిలు మాత్రమే ఖాతా పుస్తకాల్లో ఉంటాయి. ఆ రెండింటినీ పోల్చిచూస్తే అన్ని విషయాలూ తెలుస్తాయి. వడ్డీ ఆదాయంపై అదనపు లాభం పొందారని ఆరోపిస్తున్నారు. కంపెనీలు లాభాల కోసం పనిచేయడం నేరమేమీ కాదు. అదనపు ఆదాయం వస్తే ఆ కంపెనీ ఆర్థికంగా బాగా ఉన్నట్లని చెబుతున్నట్లే.
ఖాతాదారుల నుంచి ఒక్క ఫిర్యాదైనా లేదు: మార్గదర్శి సంస్థ తమ నిధులను దుర్వినియోగం చేస్తుందని కానీ, అవకతవకలకు పాల్పడుతోందని కానీ, తమకు చెల్లించాల్సిన మొత్తాన్ని జాప్యం చేస్తోందని కానీ వినియోగదారుల నుంచి ఇప్పటి వరకూ ఒక్క ఫిర్యాదు కూడా లేకపోవడాన్ని ఇక్కడ ప్రస్తావించాలి. మేం ఇదివరకే స్పష్టం చేసినట్లుగా చిట్‌ఫండ్ కంపెనీలు ఏపీ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ యాక్ట్ పరిధిలోకి రావు. ఎక్కడైనా చిట్‌ఫండ్ యాక్ట్-1982 ఉల్లంఘన ఉందా? ఏదైనా ఉంటే చిట్స్ రిజిస్ట్రార్ లేదంటే ఐజీ నుంచి అందిన నివేదికను ఇవ్వడానికి సంబంధిత దర్యాప్తు సంస్థకు అభ్యంతరమేంటో అర్థం కావడం లేదు. ఈ విషయంలో ఏదైనా తప్పు జరిగి ఉంటే, దానికి భాష్యాలు చెప్పడానికి బదులు తప్పును సరిదిద్దేలా అభిప్రాయాన్ని వ్యక్తం చేసి ఉండాల్సింది.
బుధవారం సీఐడీ జారీ చేసిన పత్రికా ప్రకటనలో శ్రీరాం చిట్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసుకు సంబంధించిన ఒక కోట్‌ను ప్రస్తావించారు. ఆ కోట్‌లో ఒక భాగాన్ని మాత్రమే సీఐడీ తీసుకున్నట్లు కనిపిస్తోంది. జాతీయ స్థాయిలో చట్టం ఉండాల్సిన అవసరాన్ని సమర్థించుకోవడం ఆ భాగం ప్రధాన ఉద్దేశం. దాని ప్రకారం 1982లో చట్టం రూపుదాల్చింది. మాకు తెలిసినంత వరకు కేంద్ర చట్టం, రాష్ట్రాల నిబంధనలకు మార్గదర్శి సంస్థ కఠినంగా కట్టుబడి ఉంటుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న గొడవ చిట్‌ఫండ్ పరిశ్రమ ప్రతిష్ఠను దెబ్బతీయడమే కాకుండా.. చిట్‌ఫండ్ అంటే ప్రైజ్ చిట్స్, పోంజీ స్కీంలుగా పొరబడే అవకాశం ఉంది.
ఇవీ చదవండి: