విమానాశ్రయాల్లో తనిఖీల కోసం బ్యాగుల నుంచి ఫోన్లు, ఛార్జర్లు, ల్యాప్‌టాప్ వంటివి బయటకు తీసి చూపించే బాధ ప్రయాణికులకు ఇక తప్పేలా ఉంది. ఎలక్ట్రానిక్ వస్తువులను బ్యాగుల్లో నుంచే తనిఖీ చేసేలా అత్యాధునిక స్కానర్లను ఎయిర్‌పోర్టుల్లో ఏర్పాటు చేయాలని విమానయాన భద్రతా పర్యవేక్షణ సంస్థ బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ ప్రతిపాదనలు చేసింది.
ప్రస్తుతం ఎయిర్‌పోర్టుల్లో ఉపయోగించే స్కానర్లు.. హ్యాండ్ బ్యాగేజీల్లో ఉన్న వస్తువులను టు-డైమెన్షనల్(2డీ)లో చూపిస్తాయి. అయితే వీటిని 3డీలో చూపించేలా కంప్యూటర్ టోమోగ్రఫీ టెక్నాలజీ ఆధారిత స్కానర్లను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించినట్లు బీసీఏఎస్ జాయింట్ డైరెక్టర్ జనరల్ జైదీప్ ప్రసాద్ తెలిపారు. "ఈ స్కానర్లతో ప్రయాణికులు ఇకపై తమ హ్యాండ్ బ్యాగేజీల నుంచి ఎలక్ట్రానిక్ వస్తువులు, పరికరాలను బయటకు తీసి ప్రత్యేక ట్రేలలో తనిఖీలకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు" అని వెల్లడించారు. దీనివల్ల, ఎయిర్‌పోర్టుల్లో తనిఖీల సమయం కూడా ఆదా అయి రద్దీ తగ్గుతుందని పేర్కొన్నారు. అయితే ఈ ప్రతిపాదనలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియరాలేదు.
ఇప్పటికే ఇలాంటి స్కానర్లను అమెరికా, ఐరోపా దేశాల్లో వినియోగిస్తున్నారు. అయితే భారత్‌లో వీటిని ఎప్పుడు ఏర్పాటు చేస్తారన్నదానిపై స్పష్టత లేదు. వచ్చే ఏడాది కాలంలో దిల్లీ, ముంబయి, బెంగళూరు, హైదరాబాద్ సహా ప్రధాన విమానాశ్రయాల్లో ఈ కొత్త స్కానర్లను అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశాలున్నాయని కొన్ని జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఇటీవల ఎయిర్‌పోర్టుల్లో తనిఖీల కారణంగా తీవ్రమైన రద్దీ నెలకొనడంపై విమర్శలు వ్యక్తమైన నేపథ్యంలో ఈ ప్రతిపాదనలు చేసినట్లు తెలుస్తోంది.
ఇటీవల దిల్లీ ఎయిర్‌పోర్టులో టర్మినల్ 3 వద్ద తనిఖీల కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చెకిన్ వద్ద ప్రయాణికులు గంటల తరబడి క్యూలైన్లలో నిల్చోవాల్సి వచ్చింది. దీంతో కొన్ని విమానాలు కూడా ఆలస్యంగా నడిచాయి. ఈ క్రమంలోనే స్పందించిన పౌరవిమానయాన శాఖ.. రద్దీ నియంత్రణకు చర్యలు చేపట్టింది.