కొవిడ్ కట్టడిలో భాగంగా వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో(Corona vaccine) భారత్ గురువారం వంద కోట్ల డోసుల(India 100 crore vaccine) మైలురాయి దాటింది(Vaccine Milestone). దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ సహా కేంద్ర మంత్రులు, ఇతర ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. మరోవైపు ఈ వ్యాక్సినేషన్(vaccination) డ్రైవ్‌లో భాగంగా ఇప్పటివరకు మొత్తం తొమ్మిది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అర్హులందరికీ ఫస్ట్ డోస్(first dose) పూర్తయినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు. అండమాన్ నికోబార్ దీవులు, చండీగఢ్, గోవా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ-కశ్మీర్, లక్షద్వీప్, సిక్కిం, ఉత్తరాఖండ్, దాద్రా నగర్ హవేలీలు ఈ జాబితాలో ఉన్నాయి. దేశంలో 18 ఏళ్లు దాటిన వారిలో 75 శాతం కంటే ఎక్కువ మంది కనీసం ఒక డోసు వేయించుకున్నట్లు చెప్పారు. 31 శాతం కంటే ఎక్కువ మందికి రెండు డోసులూ పూర్తయినట్లు తెలిపారు.
103.5 కోట్ల డోసులు సరఫరా చేశాం..
దేశంలో అత్యధిక డోసులు(Corona vaccine) వేసిన రాష్ట్రాల్లో ఉత్తర్‌ప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ 12.30 కోట్లకుపైగా డోసులు పంపిణీ చేశారు. తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, గుజరాత్, మధ్యప్రదేశ్ నిలిచాయి. మరోవైపు కేంద్రం ఇప్పటివరకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 103.5 కోట్ల డోసులను సరఫరా చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం వెల్లడించింది. ఇంకా వాటి వద్ద 10.85 కోట్ల డోసులు నిల్వ ఉన్నట్లు పేర్కొంది. 100 కోట్ల డోసుల ఘనతను అందుకున్న నేపథ్యంలో.. ఇప్పటివరకు మొదటి డోసు తీసుకున్నవారు రెండో డోసూ వేయించుకునేలా కృషి చేస్తామని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్ మాండవీయ వెల్లడించారు. దేశంలో కరోనా మహమ్మారిని అరికట్టేందుకు ఈ ఏడాది జనవరి 16న టీకా పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించింది.
ఇవీ చూడండి: చరిత్ర సృష్టించిన భారత్.. టీకా పంపిణీ@100కోట్లు