Minister Suicide Uttarakhand: సొంత మనవరాలిని వేధించినట్లు తనపై కోడలే కేసు పెట్టడం వల్ల ఉత్తరాఖండ్‌కు చెందిన మాజీ మంత్రి రాజేంద్ర బహుగుణ (59) ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఘటనకు ముందు పోలీసు ఎమర్జెన్సీ నంబర్ 112కు ఫోన్ చేసి తాను ఆత్మహత్య చేసుకొంటున్న విషయాన్ని వెల్లడించారు. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకొన్నారు. కానీ, అప్పటికే ఇంటి ట్యాంక్‌పైకి ఎక్కిన రాజేంద్ర తుపాకీతో కాల్చుకొంటానని పోలీసులను బెదిరించారు. అధికారులు లౌడ్‌స్పీకర్‌లో ఆయనతో మాట్లాడి నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. ఒక దశలో ఆయన రాజీపడ్డట్లు అనిపించినా.. హఠాత్తుగా తుపాకీతో గుండెలపై కాల్చుకొన్నారు. దీంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. దీనిపై స్థానిక పోలీస్ అధికారి పంకజ్ భట్ మాట్లాడుతూ "కుటుంబసభ్యుల నుంచి ఆరోపణల విషయంలో ఆయన తీవ్రంగా కలత చెందారు" అని పేర్కొన్నారు. బహుగుణ కుమారుడు అజేయ్ ఫిర్యాదు మేరకు కోడలు, ఆమె తండ్రి, ఓ పొరుగింటి వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
రాజేంద్ర బహుగుణపై బుధవారం ఆయన కోడలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మనవరాలితో బహుగుణ అసభ్యంగా ప్రవర్తించినట్లు ఈ ఫిర్యాదులో ఆరోపించారు. దీంతో ఆయనపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ పరిణామాలతో కలత చెందిన ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారు. గతంలో బహుగుణ కాంగ్రెస్ తరపున ఎన్డీ తివారీ మంత్రి వర్గంలో పనిచేశారు.
కోడలిని కాల్చి చంపిన అత్తమామలు: వరకట్నం తేలేదంటూ అత్తమామలు తమ కోడలిని కాల్చి చంపారు. ఈ అమానవీయ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగింది. మహిళ కాలిన గాయాలతో గురువారం మరణించిందని పోలీసులు తెలిపారు. దీంతో ఆమె భర్త సహా ఇతర కుటుంబ సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు. సజ్నా గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో 2021లో బాధితురాలికి వివాహం జరిగింది. అప్పటినుంచి వరకట్నం కోసం అత్తమామలు పదేపదే వేధిస్తున్నారని మహిళ కుటుంబ సభ్యులు ఆరోపించారు. అత్తమామలు డిమాండ్ చేసిన రూ.2 లక్షల కట్నం తీసుకురాకపోవడం వల్ల మహిళపై.. మండే ద్రవాన్ని పోసి నిప్పంటించారు.
అత్యాచార నిందితుడికి జీవితఖైదు: మైనర్ అక్కాచెల్లెళ్లపై పలుమార్లు అత్యాచారం చేసిన 35 ఏళ్ల వ్యక్తికి మహారాష్ట్ర పాల్ఘర్ కోర్టు జీవితఖైదు విధించింది. నిందితుడికి జీవితఖైదుతో పాటు రూ.10వేల జరిమానా విధించింది స్పెషల్ పోక్సో కోర్టు. బాధితులకు చట్టప్రకారం నష్టపరిహారం చెల్లించాలని జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీని ఆదేశించింది. బాధితుల బంధువైన నిందితుడు.. అనేకసార్లు అక్కాచెల్లెళ్లపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితుల్లో ఒకరు ఇంటి నుంచి పారిపోయి ఓ ఎన్జీఓ సహాకారంతో కేసు పెట్టగా.. విషయం వెలుగులోకి వచ్చింది.
తల్లిని చంపిన తనయుడు: సొంత తల్లినే చెక్కపలకతో కొట్టి చంపాడు తనయుడు. ఈ ఘటన ఒడిశాలోని కందమాల్ జిల్లాలో జరిగింది. 30 ఏళ్ల జితేంద్ర కన్హార్ తన తల్లితో గొడవపడ్డాడు. అనంతరం కోపోద్రిక్తుడైన నిందితుడు తన తల్లిని చెక్కతో కొట్టాడు. ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధరించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: ఊరేగింపులో ఆ పాటలు పెట్టినందుకు వధూవరులపై దాడి!