Chandrababu Custody Petition Adjourned To Tomorrow: తెలుగుదేశం అధినేత చంద్రబాబును కస్టడీ పిటీషన్ పై తీర్పును విజయవాడ ఏసీబీ కోర్టు రేపటికి వాయిదా వేసింది . రేపు ఉదయం 10.30 కు ఉత్తర్వులు వెలువరిస్తామని న్యాయస్థానం తెలిపింది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబును ఐదు రోజుల కస్టడీకి కోరుతూ సీఐడి అధికారులు పిటీషన్ దాఖలు చేశారు . నిన్న పిటీషన్ పై ఇరువైపులా వాదనలు ముగిశాయి. ఈరోజు ఉదయం నిర్ణయాన్ని వెల్లడిస్తామన్న న్యాయస్థానం.. సాయంత్రం 4 గంటలకు ఉత్తర్వులిస్తామని తెలిపింది. రిమాండ్ సస్పెన్షన్ ,క్వాష్ పిటీషన్ హైకోర్టులో పెండిగ్ లో ఉన్నాయన్ని విషయాన్ని న్యాయస్థానం ప్రస్తావించింది. ఎప్పుడు హైకోర్టులో తీర్పు వెలువడే అవకాశం ఉందని ప్రభుత్వ న్యాయవాదిని ఏసిబి కోర్టు ప్రశ్నించింది. సమయం పట్టే అవకాశం ఉందని న్యాయవాది తెలిపారు. రేపటి లిస్ట్ లో వస్తుందేమో వేచి చూద్దామని కోర్టు అభిప్రాయపడి.. రేపు ఉదయానికి తీర్పును వాయిదా వేసింది.
చంద్రబాబును కోర్టులో హాజరుపరిచినప్పుడు జ్యుడీషియల్ రిమాండ్ విధించాలని సీఐడి అధికారులు కోరారని.. పోలీసు కస్టడీకి కోరలేదని చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్ద్ లూత్ర వాదనలు వినిపించారు. మరుసటి రోజు దర్యాప్తు అధికారి తన నిర్ణయం మార్చుకుని కస్టడీ పిటీషన్ దాఖలు చేశారన్నారు. అరెస్ట్ చేసిన రోజు చంద్రబాబు కొన్ని గంటల పాటు విచారించి.. పూర్తి విషయాలు రాబట్టామని సీఐడి అధికారులు తెలిపారన్నారు. ఇప్పుడేమో మరిన్ని విషయాలు తెలుసుకోవాలని చెబుతూ సీఐడి కస్టడీకి ఎలా కోరుతుందని అన్నారు. కస్టడీకి ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. పిటీషన్ ను కట్టేయాలని కోరారు. మరోవైపు మొదటి 15 రోజుల లోపు కస్టడీకి ఎప్పుడైనా దర్యాప్తు అధికారి కోరవచ్చని సీఐడి తరపు న్యాయవాది అన్నారు.