కేరళ కొల్లాంలో ఓ వ్యక్తి.. చికిత్స చేస్తున్న వైద్యురాలిని అతికిరాతకంగా పొడిచి చంపాడు. తన కాలికి గాయమైందని ఆ వ్యక్తి పోలీసులకు ఫోన్ చేశాడు. అస్సలు నడవలేకపోతున్నాని.. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాలని కోరాడు. తీరా ఆస్పత్రికి తీసుకెళ్లాక.. చికిత్స చేస్తున్న మహిళా డాక్టర్‌పై కత్తెరతో దాడి చేశాడు. వైద్యురాలి ఛాతిపై ఐదుసార్లు పొడిచి ఆమె మరణానికి కారణమయ్యాడు. మృతురాలిని వందనా దాస్‌గా పోలీసులు గుర్తించారు.
పోలీసుల వివరాల ప్రకారం.. జిల్లాలోని ఓ ఎయిడెడ్ పాఠశాలలో నిందితుడు సందీప్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. డ్రగ్స్‌కు పూర్తిగా బానిసైన అతడు.. పాఠశాలలో విద్యార్థులకు ఇబ్బంది పెడుతుండడం వల్ల సస్పెండ్ చేశారు. ఆ తర్వాత స్థానికులతో కూడా రోజూ గొడవలు పడేవాడు. మంగళవారం కూడా అతడికి తన కుటుంబసభ్యులతో గొడవ జరిగింది. ఆ తర్వాత అతడే స్వయంగా పోలీసులకు సమాచారం అందించాడు. తన కాలికి గాయమైందని.. నడవలేకపోతున్నానని వెంటనే రావాలని పలుమార్లు పోలీస్ స్టేషన్‌కు ఫోన్ చేశాడు. అనంతరం పోలీసులు వచ్చి అతడిని కొట్టారక్కరా ఆస్పత్రికి బుధవారం తెల్లవారుజామున తరలించారు. ఆస్పత్రికి తీసుకొచ్చేటప్పటికి అతడి చేతికి సంకెళ్లు వేయలేదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
అయితే డ్యూటీలో ఉన్న డాక్టర్ వందన.. అతడిని పలు వైద్య పరీక్షలు చేశారు. ఆ సమయంలో అతడి కాలికి గాయమైనట్లు గుర్తించారు. దీంతో వందనా దాస్ చికిత్స ప్రారంభించారు. ఆ సమయంలో నిందితుడు ఒక్కసారిగా అక్కడే ఉన్న కత్తెరతో చెలరేగిపోయాడు. 'నేను నిన్ను చంపేస్తా' అంటూ అరిచాడు. డాక్టర్‌తోపాటు పోలీసు అధికారిపై దాడి చేశాడు. వైద్యురాలి ఛాతిపై ఐదుసార్లు పొడిచాడు. పోలీస్‌ను కూడా తీవ్రంగా గాయపరిచాడు. వెంటనే వైద్యురాలిని తిరువనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందారు. ఆస్పత్రిలో పలు వస్తువులను కూడా నిందితుడు ధ్వంసం చేశాడు. ఘటన జరిగాక అతడిని స్టేషన్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఘటనపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధికారి స్పందించారు. ఇదొక దురదృష్టకరమైన ఘటన అని ఆయన అన్నారు. కేరళ అంతటా వైద్యులు.. ఈ ఘటనకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతారని ఆయన చెప్పారు. "ఇలాంటి ఘటనలు జరగకూడదు. అలాంటి పరిస్థితుల్లో మేము (వైద్యులు) పనిని కొనసాగించలేము. ప్రాణాలను కాపాడటానికి ప్రయత్నిస్తున్నప్పుడు మా ప్రాణాలకు ప్రమాదం ఏర్పడటం ఆమోదయోగ్యం కాదు. వైద్య నిపుణులపై ఇటువంటి దాడులపై మేము గతంలో కూడా మా అభ్యంతరాలను తెలిపాం" అని ఆయన చెప్పారు.
వైద్యుల ఆందోళన
ఈ ఘటనను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వైద్యులు ఆందోళన చేశారు. తిరువనంతపురంలో వైద్య విద్యార్థులు, హౌస్ సర్జన్లు ర్యాలీ నిర్వహించారు. వైద్య కళాశాల నుంచి బ్లడ్ బ్యాంక్ వరకు ర్యాలీగా వెళ్లారు. నల్లటి జెండాలు, బ్యానర్లు ప్రదర్శించారు. ఎమర్జెన్సీ వైద్య సేవలకు ఆటంకం కలగకుండా ఆందోళన చేపట్టినట్లు వైద్యులు తెలిపారు. కాసర్గోడ్ జనరల్ ఆస్పత్రిలోని వైద్యులు సైతం నిరసన చేశారు. వివిధ జిల్లాల్లోనూ ఆందోళనలు జరిగాయి.
వైద్యురాలి హత్యపై కేరళ హైకోర్టు సైతం తీవ్రంగా స్పందించింది. ఈ ఘటన వ్యవస్థ వైఫల్యమేనని, వైద్యులను రక్షించడంలో పోలీసుల వైఫల్యానికి నిదర్శనమని ఘాటు వ్యాఖ్యలు చేసింది.
స్కూటీని ఢీకొట్టిన కారు.. తండ్రీకొడుకులు మృతి
కేరళలోనే మరో విషాద ఘటన జరిగింది. స్కూటీని కారు ఢీకొట్టడం వల్ల తండ్రీకుమారులు అక్కడికక్కడే మృతి చెందారు. అతడి భార్య, తల్లి తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నారు. మృతులను అతుల్, అన్విక్గా పోలీసులు గుర్తించారు.
పోలీసుల వివరాల ప్రకారం.. కోజికోడ్ జిల్లాలోని కోరాపుజా వంతెనపై ఈ ప్రమాదం జరిగింది. వెస్ట్హిల్కు చెందిన అతుల్(24).. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కె.మురళీధరన్ వద్ద కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతుల్.. తన అతడి భార్య, తల్లి, కుమారుడిని స్కూటీపై తీసుకుని తన బంధువులు ఇంట జరిగిన గృహప్రవేశ వేడుకకు హాజరయ్యాడు. అనంతరం మంగళవారం రాత్రి తన స్వగ్రామానికి బయలుదేరాడు.
అర్ధరాత్రి 12 గంటల సమయంలో అతుల్ స్కూటీని ఓ కారు బలంగా ఢీకొట్టింది. దీంతో అతుల్, అతడి కుమారుడు చనిపోయారు. అయితే కారులో ఉన్న నలుగురికి గాయాలయ్యాయి. మితిమీరిన వేగమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధరించామని పోలీసులు తెలిపారు. కారు డ్రైవర్‌పై హత్యానేరం కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అతుల్ భార్య మాయ, తల్లి కృష్ణవేణి గాయాలతో కోజికోడ్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.