Jayalalitha Brother Vasudevan: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు తాను సోదరుడినంటూ కర్ణాటకకు చెందిన ఓ వృద్ధుడు.. మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆమె ఆస్తిలో సగం వాటా తనకు ఇవ్వాలని పిటిషన్లో కోరారు.
మైసూరులోని వ్యాసపురానికి చెందిన వాసుదేవన్ (83) మద్రాసు హైకోర్టులో ఈ వ్యాజ్యం వేశారు. 2020లో మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పులో జయలలిత వారసులుగా దీపక్, దీపతో పాటు తన పేరును కూడా చేర్చి తీర్పును సవరించాలని ఆయన కోరారు.
"జయలలిత తండ్రి జయరామ్ మొదటి భార్య జయమ్మ ఒక్కగానొక్క కుమారుడ్ని నేను. ఆ తర్వాత మా నాన్న జయరామ్.. వేదమ్మ అనే మహిళను రెండో వివాహం చేసుకున్నారు. వారికి పుట్టిన వారే జయలలిత, జయకుమార్. 1950లో మా అమ్మ జయమ్మ మైసూరు కోర్టులో భరణం కోసం కేసు వేసింది. ఆ కేసులో మా నాన్న రెండో భార్య వేదమ్మ, జయకుమార్, జయలలితను ప్రతివాదులుగా చేర్చాం. తర్వాత ఆ కేసు కొలిక్కి వచ్చింది. కానీ జయలలిత కంటే ముందే జయకుమార్ మరణించారు. కాబట్టి జయలలితకు సోదరుడిగా నేను కూడా వారసుడ్ని. అందుకే ఆమె ఆస్తిలో 50 శాతం నాకే ఇవ్వాలి."
-- పిటిషన్లో వాసుదేవన్
అయితే జయలలిత వారసులు.. దీపక్, దీప మాత్రమేనని మద్రాసు హైకోర్టు 2020లో తీర్పునిచ్చింది. అదే సమయంలో నటుడు శోభన్‌బాబు, జయలలిత కుమార్తెగా పేర్కొంటూ.. కర్ణాటకకు చెందిన అమృత అనే మహిళ కూడా కేసు వేయగా హైకోర్టు కొట్టివేసింది.
ఇవీ చదవండి: ఒడిలో తమ్ముడి మృతదేహం.. మదిలో పుట్టెడు దుఃఖం.. రోడ్డుపక్కనే 8ఏళ్ల బాలుడు