మహారాష్ట్రలో సోలాపుర్ జిల్లాలో(Maharashtra solapur news) ఘోర ప్రమాదం(Maharashtra accident news) జరిగింది. మల్టీ యుటిలిటీ వెహికిల్(ఎంయూవీ) బోల్తా పడిన ఘటనలో ఐదుగురు మృతి చెందారు. మరో ఏడుగురికి గాయాలయ్యాయి. ఎంయూవీ టైర్ పేలగా ఈ ప్రమాదం జరిగింది.
అక్కల్కోట్-సోలాపుర్ రహదారిపై కుంభార్లీ గ్రామం వద్ద మంగళవారం ఉదయం 10.30 గంటలకు ఈ ప్రమాదం జరిగిందని వాస్లాంగ్ పోలీస్ స్టేషన్ అధికారి ఒకరు తెలిపారు. "కుంభార్లీ గ్రామం వద్దకు చేరుకోగానే.. హఠాత్తుగా ఎంయూవీ ముందు టైర్ పేలిపోయింది. దాంతో వాహనం బోల్తా పడింది. ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించగా.. మిగతావారు ఆస్పత్రికి తరలించాక ప్రాణాలు కోల్పోయారు" అని అసిస్టెంట్ పోలీస్ ఇన్స్పెక్టర్ అతుల్ భోస్లే తెలిపారు. మరో ఏడుగురు గాయపడగా.. వారిని ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు.
మృతుల్లో ఇద్దరు మహిళలు ముగ్గురు పురుషులు ఉన్నారని సదరు అధికారి తెలిపారు. "ప్రయాణికులు ఒకరికొకరితో సంబంధం లేని వారని తెలుస్తోంది. వారు సోలాపుర్కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఇప్పటివరకు గాయపడ్డ వారిలో ఒకరిని మాత్రమే గుర్తించాం"అని చెప్పారు.
ఒకే కుటుంబంలో ఆరుగురు మృతి
బిహార్ లఖీసరాయ్లో అత్యంత విషాద ఘటన జరిగింది. దహన సంస్కారాలకు హాజరై తిరిగి వస్తున్న ఒకే కుంటుంబంలోని ఆరుగురు రోడ్డు ప్రమాదంలో(Bihar accident news) మరణించారు. గ్యాస్ సిలిండర్ల ట్రక్కు ఢీకొని.. టాటా విక్టా వాహనంలో ప్రయాణిస్తున్న వారిలో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను పట్నాలోని పీఎంసీహెచ్కు తరలించారు.
హరియాణా డీఐజీ కుటుంబంలో ఒకరు మరణించగా.. పట్నాలో దహనసంస్కారాలు నిర్వహించారు. ఆయన సోదరి కుటుంబం టాటా విక్టాలో తిరిగివస్తుండగా.. ఈ ఘోర ప్రమాదం జరిగింది. డ్రైవర్ సహా మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం గమనార్హం. అయితే టాటా విక్టా డ్రైవర్ నిద్రమత్తులో ఉండటమే ప్రమాదానికి కారణమని స్థానికులు పేర్కొన్నారు. ట్రక్కు వేగంగా ఢీకొనడం వల్ల ఈ వాహనం అమాంతం గాల్లో ఎగిరిపిడినట్లు చెప్పారు.
పోలీసులు కేసు నమోదు చేసి ట్రక్కు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసును స్వయంగా ఎస్పీ పర్యవేక్షిస్తున్నారు.
ఇదీ చూడండి: 'పికప్' చేసుకోకుండా వెళ్లిన బస్సు.. ఆర్టీసీకి రూ.1000 ఫైన్!