13 Years old Girl Died of Heart Attack : ఆ పసి గుండెకు ఎంత కష్టమొచ్చిందో.. ఇక నేను కొట్టుకోలేనంటూ ఆగిపోయింది. ఆడుతూ పాడుతూ గడపాల్సిన ఆ చిన్నారి.. 13 ఏళ్లకే అనంత లోకాలకు చేరుకుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు కుటుంబసభ్యులు, తోటి మిత్రులతో సరదాగా ఆడి పాడిన బాలిక హఠాత్తుగా గుండె ఆగిపోవడంతో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. మహబూబాబాద్ జిల్లాలో ఈ హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది.
దీనికి సంబంధించి కుటుంబసభ్యులు, తండా వాసులు తెలిపిన వివరాల ప్రకారం.. మరిపెడ మండలం బోడతండాకు చెందిన బోడ లక్‌పతి-వసంత దంపతులు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు సంతానం. రెండో సంతానమైన స్రవంతి ఓ ప్రైవేట్ స్కూల్‌లో ఆరో తరగతి చదువుతోంది. శ్రీరామ నవమి సందర్భంగా పాఠశాలకు సెలవు కావటంతో తోటి పిల్లలతో కలిసి సాయంత్రం వరకు తండాలో ఆడుకుంది. కుటుంబసభ్యులతో కలిసి భోజనం చేసి రాత్రి నాయనమ్మ వద్ద నిద్రించింది. శుక్రవారం తెల్లవారు జామున ఛాతిలో ఏదో ఇబ్బందిగా ఉందంటూ నానమ్మను లేపింది. అంతలోనే ఒక్కసారిగా కుప్పకూలింది.
సీపీఆర్ చేసినా దక్కని ప్రాణం..: ఏం జరిగిందో అర్థం కాని ఆ వృద్ధురాలు.. వెంటనే కుటుంబసభ్యులకు విషయం చెప్పింది. బాలిక తండ్రి ఆమెకు సీపీఆర్ చేసి.. ప్రాణాలు నిలబెట్టే ప్రయత్నం చేశాడు. ప్రయోజనం లేకపోవడంతో స్థానికంగా ఉన్న ఓ ఆర్‌ఎంపీ వైద్యుడి వద్దకు తీసుకెళ్లాడు. డాక్టర్ ఆ బాలిక చనిపోయిందని చెప్పినా ఆ తండ్రి గుండె ఒప్పుకోలేదు. తన గారాల పట్టి అంతలోనే తనను విడిచిపెట్టి వెళ్లిందని నమ్మలేకపోయిన ఆ కన్నతండ్రి.. ఎలాగైనా కూతుర్ని బతికించుకోవాలని ఖమ్మంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే బాలిక మృతి చెందినట్లు ధ్రువీకరించడంతో ఆ తండ్రి గుండెలవిసేలా రోదించాడు. అనంతరం చిన్నారిని తండాకు తీసుకొచ్చి దహన సంస్కారాలు పూర్తి చేశారు. బాలిక మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
''శ్రీరామనవమి సందర్భంగా స్కూల్‌కు సెలవు కావడంతో రోజంతా తోటి పిల్లలతో కలిసి ఆడుకుంది. రాత్రి భోజనం చేసి మా అమ్మ దగ్గర పడుకుంది. తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో ఛాతిలో నొప్పిగా ఉందని చెబితే మా అమ్మ తమ్ముడికి విషయం చెప్పింది. మేం వెళ్లే వరకే కుప్పకూలిపోయింది. వెంటనే మేము స్థానికంగా ఉన్న ఆర్‌ఎంపీ డాక్టర్ వద్దకు తీసుకెళ్లాం. చనిపోయిందని చెబితే.. బతుకుతుందేమోననే ఆశతో ఖమ్మం పెద్దాసుపత్రికి తీసుకెళ్లాం. అక్కడ డాక్టర్లు పరీక్షించి చనిపోయిందని చెప్పారు.'' - బాలిక పెద్ద నాన్న
ఇవీ చూడండి..
ఆగిపోతున్న యువ హృదయాలు.. ఖమ్మంలో ఇంటర్ విద్యార్థి, పెద్దపల్లిలో బాడీ బిల్డర్ మృతి
వారే రియల్ హీరోలు.. ట్విటర్లో మంత్రి హరీశ్‌రావు పొగడ్తల వర్షం