Rock Blasts in Jubilee Hills: జూబ్లీహిల్స్ ప్రాంతంలో కొండ రాళ్ల తొలగింపునకు పేలుళ్లు జరపడంపై విచారణ జరిపిన హైకోర్టు సీజే ధర్మాసనం ప్రతివాదులకు నోటీసు జారీ చేసింది. కొండ రాళ్ల తొలగింపునకు రాత్రి వేళల్లో పేలుళ్లు జరుపుతున్నారని మీడియాలో వచ్చిన కథనం ఆధారంగా ప్రధాన న్యాయమూర్తికి జస్టిస్ భీమపాక నగేశ్ లేఖ రాశారు. రాత్రి వేళల్లో జరుపుతున్న భారీ పేలుళ్లతో న్యాయవిహార్, భరణి లేఔట్, రామానాయుడు స్టూడియో ప్రాంతాల్లో నివాసముండే వారికి నిద్ర ఉండటం లేదని లేఖలో పేర్కొన్నారు. పేలుళ్ల తర్వాత బండరాళ్లని రాత్రి వేళల్లో భారీ వాహనాల్లో తరలిస్తున్నారని తెలిపారు.
జస్టిస్ నగేష్ భీమపాక లేఖను ప్రజాప్రయోజన వ్యాజ్యంగా స్వీకరించిన సీజే ధర్మాసనం భూగర్భ గనులు, పర్యావరణ శాఖ, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శులు, కాలుష్య నియంత్రణ మండలి, జీహెచ్ఎంసీ కమిషనర్‌కు నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.