Biden Letter To Congressional Democrats : డెమొక్రటిక్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష అభ్యర్థిని తానే అని జో బైడెన్ పునరుద్ఘాటించారు. తన అభ్యర్థిత్వంపై పార్టీలో అంతర్గత డ్రామా కట్టిపెట్టాలంటూ డెమొక్రటిక్ కాంగ్రెస్ సభ్యులకు రాసిన రెండు పేజీల లేఖలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 'డెమొక్రటిక్ కన్వెన్షన్‌కు 42రోజులు, యూఎస్ జనరల్ ఎలెక్షన్స్‌కు 119రోజుల సమయం ఉంది. మనం తీసుకున్న సంకల్పం బలహీనపడటం, ముందున్న పనిపై స్పష్టత లేకపోవడం ట్రంప్‌నకు మాత్రమే సహాయపడుతుంది. అది మనను బాధపెడుతుంది. మనందరం ఏకతాటిపైకి వచ్చి, పార్టీగా కలిసికట్టుగా ముందుకు సాగుతూ ట్రంప్‌ను ఓడించడానికి సమయం ఆసన్నమైంది' అని బైడెన్ అన్నారు.
కొంతకాలంగా బైడెన్ అభ్యర్థిత్వంపై సొంత పార్టీలోనే అసహనం కనిపిస్తోంది. ఇటీవల ట్రంప్‌తో జరిగిన డిబేట్ తర్వాత బైడెన్ తన అభ్యర్థిత్వం వదులుకోవాలని డెమొక్రటిక్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అదే సమయంలో కొంత మంది బైడెన్ మద్దతుదారులు, ట్రంప్‌ను ఓడించడానికి ఇంతకంటే మంచివారు ఉండరంటున్నారు.