Jangaon Engineer Murder In Uganda : ఉగాండా దేశంలో మద్యం మత్తులో సెక్యూరిటీ గార్డు జరిపిన కాల్పుల్లో జనగామకు చెందిన ఇంజినీర్ తిరుమలేశ్ మరణించారు. తిరుమలేశ్ మృతి వార్త తెలియగానే కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. జనగామ పట్టణం తొమ్మిదో వార్డు గిర్నిగడ్డకు చెందిన ఇటికాల తిరుమలేశ్ (42) సివిల్ ఇంజినీర్ పూర్తి చేశారు. కొంతకాలం కరీంనగర్‌లో ఉద్యోగం చేసిన అనంతరం, ఉగాండా దేశంలోని రాయల్‌టెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో అవకాశం రావడంతో పదేళ్ల క్రితం అక్కడికి వెళ్లారు. ప్రాజెక్టు మేనేజర్ హోదాలో పని చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఉగాండాలోని నమ్మశాల ప్రాంతంలోని కంపెనీలో శుక్రవారం తిరుమలేశ్ విధుల్లో ఉండగా, శుక్రవారం ఉదయం 9.30 గంటల సమయంలో (భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12.30 గంటలు) అదే కంపెనీకి చెందిన సెక్యూరిటీ గార్డు తాగిన మైకంలో ఒక్కసారిగా తుపాకీతో గాల్లోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. భారీ శబ్ధం విని బయటకు వచ్చిన తిరుమలేశ్పైనా విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ తర్వాత సెక్యూరిటీ గార్డు కూడా తనను తాను కాల్చుకుని చనిపోయాడు.
ఈ ఘటనతో భయకంపితులైన కంపెనీలోని ఇతర ఉద్యోగులు బయటకు రాలేదు. తిరుమలేశ్ మృతి చెందిన విషయాన్ని కంపెనీ ప్రతినిధులు జనగామలో ఉంటున్న తల్లి కిష్టమ్మ, సోదరుడు చిన్నాకు సమాచారం అందించడంతో కుటుంబ సభ్యులంతా ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయారు. తిరుమలేశ్‌కు భార్య సునీత, కుమార్తె అఖిల, కుమారుడు వరుణ్ ఉన్నారు. కుమార్తె అఖిల నిజామాబాద్‌లోని అమ్మమ్మ ఇంటి వద్ద 8వ తరగతి చదువుతోంది. కుమారుడు వరుణ్ ఉగాండాలోనే తల్లిదండ్రులతో ఉంటూ పదో తరగతి చదువుతున్నాడు.
తిరుమలేశ్ తండ్రి కిష్టయ్య కరోనాతో నాలుగేళ్ల క్రితం మృతి చెందారు. మృతుడి తల్లి కిష్టమ్మతో పాటు మరో సోదరుడు చిన్నా, సోదరి హేమలత జనగామలోనే ఉంటున్నారు. తిరుమలేశ్ మృతి వార్త తెలియగానే ఆయన ఇంటికి బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో వచ్చి కుటుంబ సభ్యులను పరామర్శించి కన్నీళ్లు పెట్టుకున్నారు.
అంతా సివిల్ ఇంజినీర్లే : మృతి చెందిన తిరుమలేశ్ సివిల్ ఇంజినీర్ కాగా, అతని సోదరుడు చిన్నా కూడా సివిల్ ఇంజినీర్‌గా సిద్దిపేటలో పని చేస్తున్నారు. తండ్రి కిష్టయ్య సివిల్ ఇంజినీరింగ్ విభాగంలోనే పని చేసేవారు. పిల్లలను ఉన్నత చదువులు చదివించి మంచి స్థానాలకు చేర్చిన తండ్రి కిష్టయ్య కరోనాతో దూరం కాగా, ఇప్పుడు ఇంటి పెద్ద కుమారుడు తిరుమలేశ్ కూడా చనిపోవడంతో తల్లి కిష్టమ్మతో పాటు కుటుంబమంతా శోకసంద్రంలో మునిగిపోయింది. తిరుమలేశ్ మృతదేహాన్ని మంగళవారం వరకు జనగామకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు సోదరుడు చిన్నా తెలిపాడు. ఉగాండాలోని ఎంబసీ అధికారులకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ద్వారా సమాచారం చేరవేసి మృతదేహం రప్పించేందుకు స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి చొరవ తీసుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి - అనుమానాస్పద స్థితిలో సిద్దిపేట యువకుడి మృతి