Exam Reforms In India : వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రారంభమయ్యే ప్రవేశ పరీక్షల్లో వివిధ సంస్కరణలు ప్రవేశపెడుతున్నామని కేంద్ర విద్యాశాఖమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. ప్రవేశ పరీక్షల్లో ఎటువంటి లోపాలకు ఆస్కారం లేకుండా చూస్తున్నామని అన్నారు. ఇందుకు రాష్ట్రాలు కూడా తమ సహకారం తప్పనిసరిగా అందించాలని విజ్ఞప్తి చేశారు.
"అన్ని రాష్ట్రాల విద్యాశాఖ కార్యదర్శులకు విజ్ఞప్తి చేస్తున్నా. వచ్చే జనవరి నుంచి కొత్త ప్రవేశ పరీక్షల సిరీస్ రానుంది. గత ఏడాది అనుభవాలను దృష్టిలో ఉంచుకొని అనేక సంస్కరణలను ప్రభుత్వం ప్రవేశపెడుతోంది" అని ప్రధాన్ పేర్కొన్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)లో సంస్కరణలకు సంబంధించి కె.రాధాకృష్ణన్ కమిటీ నివేదికను సమర్పించిందని ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. ఈ సిఫార్సులను అమలు చేయడానికి రాష్ట్రాల సహకారం తప్పనిసరి అన్నారు. నెట్, నీట్ ప్రశ్నపత్రాలు లీకైన నేపథ్యంలో ఎన్‌టీఏను సంస్కరించేందుకు కె.రాధాకృష్ణన్ అధ్యక్షతన కేంద్రం ఓ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.