పుంగనూరులో వైసీపీ తాయిలాలు - పంపిణీకి సిద్ధంగా చీరలు - వీడియో వైరల్ - YSRCP Sarees Distribution to Women
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 14, 2024, 4:59 PM IST
YSRCP Sarees Distribution to Women: రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తుండగా ప్రజలను ఆకట్టుకునేందుకు వైసీపీ సర్కార్ ప్రలోభాలకు తెర తీసింది. పలు జిల్లాల్లో వాలంటీర్లు, అంగన్వాడీలకు ఇప్పటికే తాయిలాలు పంపిణీ చేయగా తాజాగా పుంగనూరులో మహిళలకు చీరలు పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చీరలను సచివాలయంలో నిల్వ చేయడమే కాకుండా వాలంటీర్ల ద్వారా పంపిణీ చేసేందుకు సిద్ధమవుతున్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. రాగానిపల్లె రోడ్డులో సచివాలయంలో నిల్వ చేసిన చీరలను వాలంటీర్లు ఆటోలో తీసుకుని వెళ్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. వైసీపీ నేతలు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
ఇటీవల భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ అన్ని రశీదులతో తీసుకొచ్చిన గోడ గడియారాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంత హంగామా చేసిన అధికారులు ఈ చీరల పంపిణీపై చూసీచూడనట్లుగా ఎందుకు వ్యవహరిస్తున్నారని ప్రతిపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు. సచివాలయంలో చీరలు నిల్వ చేయడం, వాలంటీర్ల పంపిణీ అంశంపై విచారణ జరిపించాలని ఆయా పార్టీల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.