బీజేపీ నేతలపై వైఎస్సార్సీపీ నేతల దాడి: వైఎస్సార్సీపీ విధానాలను వివరిస్తున్నందుకే దాడి చేస్తున్నారు - ప్రజాపోరు రథంపై వైఎస్సార్సీపీ దాడి
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 26, 2024, 12:28 PM IST
YSRCP Leaders Attack On BJP Leaders In Narasaraopeta: వైఎస్సార్సీపీ నేతల దాడులు రోజురోజుకూ పెచ్చురిల్లుతున్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వ వైఫల్యాలు, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరిస్తూ ప్రజాపోరు పేరుతో బీజేపీ నాయకులు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వీరిపై వైఎస్సార్సీపీ నేతలు ఆదివారం అర్ధరాత్రి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో నరసరావుపేట బీజేపీ పట్టణ అధ్యక్షుడు రంగిశెట్టి రామకృష్ణ, పలువురు కార్యకర్తలు గాయపడ్డారని వివరించారు.
పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం అల్లూరివారిపాలెంలో 'ప్రజాపోరు' ప్రచార రథం ద్వారా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాల గురించి తెలియజేస్తూ కరపత్రాలు పంచుతూ బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. ఈ సమయంలో ప్రచారం చేయడానికి వీల్లేదంటూ వైఎస్సార్సీపీ నేతలు వాగ్వాదానికి దిగారని బీజేపీ పట్టణ అధ్యక్షుడు రంగిశెట్టి రామకృష్ణ పేర్కొన్నారు. ప్రధాన మంత్రిని, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిని దుర్భాషలాడుతుండగా ప్రశ్నించినందుకు రామకృష్ణపై దాడికి పాల్పడినట్టు తెలిపారు. బీజేపీ శ్రేణులు, ప్రచార రథాన్ని అడ్డుకుని ధ్వంసం చేసి ప్లాస్టిక్ పైపులు, కర్రలతో దాడి చేశారని బీజేపీ నాయకులు తెలిపారు. ఈ ఘటనపై నరసరావుపేట డీఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరిస్తున్నందుకే దాడి చేశారని ఆరోపించారు