అంగన్వాడీ కార్యకర్తకు వైసీపీ నేతల వేధింపులు - అధికార పార్టీ నేతలు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని గౌతు శిరీష హెచ్చరిక - attacked on Anganwadi worker
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 12, 2024, 6:52 PM IST
YCP Leaders Attacked on Anganwadi Worker in Srikakulam District : పలాసలో వైెఎస్సార్సీపీ నాయకుల ఆగడాలు రోజురోజుకూ మితిమీరిపోతున్నాయి. ఓ అంగన్వాడీ కార్యకర్త, ఆమె కుమారుడిపై అధికార పార్టీ సానుభూతిపరులు సోమవారం దాడికి పాల్పడ్డారు. ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం, బంటుకొత్తూరుకు చెందిన అంగన్వాడీ కార్యకర్త అప్పల నరసమ్మను సర్పంచి షణ్ముఖరావు, ఎంపీపీ ప్రతినిధి సాయికృష్ణ కొన్ని రోజులుగా వేధిస్తున్నారు. ఈ విషయమై సోమవారం బంటుకొత్తూరు వచ్చిన మంత్రి అప్పలరాజుకు ఫిర్యాదు చేసేందుకు అంగన్వాడీ కార్యకర్త యత్నించగా అక్కడున్న వైసీపీ నాయకులు అడ్డుకున్నారు. అయినప్పటికీ ఆమె మంత్రి వద్దకు వెళ్తుండగా నెట్టేసి చేయి చేసుకున్నారు. అక్కడే ఉన్న మంత్రి ఇదంతా చూస్తున్నప్పటికీ స్పందించకపోవడంతో స్థానికులు విస్మయానికి గురయ్యారు.
వెంటనే ఘటనపై బాధితురాలు, తన కుమారుడు సాయికిరణ్‌తో కలిసి కాశీబుగ్గ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న వైసీపీ సానుభూతిపరులు బయటకొచ్చిన సాయికిరణ్ స్టేషన్ ఆవరణలోనే దుర్భాషలాడి దాడి చేశారు. అనంతరం టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష, ఆ పార్టీ నాయకులు పోలీసు స్టేషన్‌కు వచ్చి బాధితులకు సంఘీభావం తెలిపారు. వైసీపీ నేతలు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని గౌతు శిరీష మండిపడ్డారు. తెలుగుదేశం కార్యకర్తలు క్రమశిక్షణ తప్పితే పరిస్థితి వేరే విధంగా ఉంటుందని హెచ్చరించారు. ఇరు పార్టీల శ్రేణులు అక్కడికి చేరుకోవడంతో ఠాణా వద్ద రెండు గంటలపాటు ఉద్రిక్తత నెలకొంది.