కోడ్ అమలులో ఉన్నా నడిరోడ్డుపై వైసీపీ నేత ఎన్నికల ప్రచార సభ- వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు - YCPLeader Election Campaign on Road
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 18, 2024, 10:27 AM IST
YCP Leader Kethireddy Election Campaign Meeting on The Road: శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో లక్ష్మీ చెన్నకేశవపురం వైఎస్సార్ కూడలి వద్ద ప్రధాన రహదారిని బ్లాక్ చేసి వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఎన్నికల ప్రచార సభ నిర్వహించారు. ధర్మవరం పట్టణంలోని ఒకవైపు రహదారిని పూర్తిగా బంద్ చేశారు. ఆర్‌అండ్‌బీ రహదారిపై వేదిక, సభకు వచ్చిన వారు కూర్చునేందుకు కుర్చీలు వేశారు. ధర్మవరం నుంచి పుట్టపర్తి, ఎన్.ఎస్.గేటు వైపు రాకపోకలు చేసేందుకు వాహనదారులు వీలు లేకపోవడంతో మరోవైపు వెళ్లాల్సి వచ్చింది. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినా రోడ్డుపై వైసీపీ ఎన్నికల సభ ఏర్పాటు చేయడంపై సర్వత్రా విమర్శలు వెలువెత్తుతున్నాయి. నడిరోడ్డుపై ప్రచార సభ ఎలా నిర్వహిస్తారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఈ మార్గంలో రాకపోకలకు ఆటంకం కలిగించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సభాప్రాంగణం సమీపంలోనే ఉన్న వైఎస్సార్ విగ్రహానికి ముసుగు వేయకుండా అలాగే వదిలేశారు. ఎన్నికల సభ నిర్వహించడంపై ఆర్డీవో, రిటర్నింగ్ అధికారి వెంకట శివరామిరెడ్డిని అడగగా ఎన్నికల కోడ్ రాక ముందే సభ నిర్వహణకు అనుమతి తీసుకున్నారని తెలిపారు. పోలీసులు కూడా మైక్ పర్మిషన్ ఇచ్చారని పేర్కొన్నారు. రహదారిపై కాకుండా సభ పక్కన నిర్వహిస్తామని చెప్పడంతో అధికారులు అనుమతులు ఇచ్చారని వివరించారు. అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై పలు అనుమానాలకు దారి తీస్తుంది.