దేశ ప్రగతికి యువతే రథసారథులు- ఓటు నమోదుపై అవగాహన సదస్సులు
🎬 Watch Now: Feature Video
Voter Registration Awareness Conference: రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో కళాశాల విద్యార్థులను చైతన్య పరుస్తూ ఈనాడు-ఈటీవీ ఓటు అవగాహన సదస్సులు నిర్వహిస్తోంది. ప్రకాశం, విజయనగరం, బాపట్ల జిల్లాల్లోని పలు కళాశాలల్లో విద్యార్థులకు అవగాహన సదస్సులు నిర్వహించారు. దేశ ప్రగతికి యువతే రథసారథులని అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు ఉండాలని విజయనగరం జిల్లా భోగాపురం లెండి డిగ్రీ కళాశాల డైరెక్టర్ విద్యార్థులకు సూచించారు. ఆన్‌లైన్‌లో పలు వెబ్ సైట్ల ద్వారా ఓటు ఎలా దరఖాస్తు చేసుకోవాలో బాపట్లజిల్లా చీరాలలోని గౌతమి కళాశాల విద్యార్థులకు బీఎల్వోలు వివరించారు.
ఓటుతోనే సుపరిపాలన సాధ్యపడుతుందని విజయనగరంలోని అయ్యప్ప ఐటీఐ ప్రిన్సిపల్ కె. కల్యాణ కుమార్ అన్నారు. 'ఈనాడు- ఈటీవీ' ఆధ్వర్యంలో సోమవారం కళాశాలలో జరిగిన ఓటు నమోదు చైతన్యంపై అవగాహన సదస్సులో ఓటుతోనే యువత భవిష్యత్తు ముడిపడి ఉందన్నారు. ఐదేళ్లు మనల్ని పాలించే వ్యక్తి ఎలాంటి వాడో ఆలోచించుకొని సరైన తీర్పు ఇవ్వాలని సూచించారు. ఓటే కదా అని నిర్లక్ష్యం చూపిస్తే ప్రశ్నించే హక్కు కోల్పోతామన్నారు. ప్రతి ఒక్కరూ ఆన్‌లైన్‌లో ఓటు నమోదు చేసుకోవాలన్నారు.