అక్షయపాత్ర 'రైస్‌పుల్లింగ్' పేరిట అమాయకులకు టోకరా - ఇద్దరు అరెస్ట్ - Rice pulling racket
🎬 Watch Now: Feature Video
Two Persons Arrested in Rice Pulling Racket : రైస్ పుల్లింగ్ (Rice Pulling) పేరుతో అమాయకులు, అత్యాశపరులనే లక్ష్యంగా పెట్టుకుని మోసాలకు పాల్పడుతున్నారు కొందరు కేటుగాళ్లు. అసలు రైస్ పుల్లింగ్ అంటే ఏంటో తెలియని వారికి మాయ మాటలు చెప్పి బురిడి కొట్టిస్తున్నారు. డబ్బుపై ఆశపడుతున్న వారిని టార్గెట్ చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. రాగి చెంబు, బియ్యం ఇవి ఉంటే చాలని ప్రజలను నమ్మించి లక్షలు దండుకుంటున్నారు. చెంబులో మహిమలున్నాయంటూ జనాలను మోసం చేస్తున్నారు. ఈ చెంబును విక్రయిస్తే వారికి అదృష్టం వరించి రాత్రికి రాత్రే కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని నమ్మబలికిస్తున్నారు. అనంతరం వారి వద్ద నుంచి భారీ మొత్తంలో నగదు వసూలు చేస్తున్నారు.
తాజాగా అక్షయపాత్ర రైస్‌పుల్లింగ్ పేరిట ప్రజలను మోసం చేస్తున్న ఇద్దరిని కోనసీమ జిల్లా కొత్తపేట పోలీసులు అరెస్ట్ చేశారు. జేఎన్యుఆర్ఎమ్ కాలనీలోని నిందితుల స్థావరంపై ఒక్కసారిగా మెరుపు దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. వారివద్ద నుంచి రాగి చెంబులు, రసాయనాలు, గ్యాస్ సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు. మహిమలు కలిగిన అక్షయ పాత్రలంటూ రాగి చెంబులు తయారు చేసి విక్రయిస్తున్నారని పోలీసులు తెలిపారు. గతంలో ఈ అక్షయ పాత్ర పేరుతో ఎవరినైనా మోసం చేశారనే కోణంలో విచారిస్తున్నారు.