సాంకేతిక లోపంతో నిలిచిన రైలు - నిప్పురవ్వలు ఎగిసి పడటంతో భయపడిన ప్రయాణికులు - Train Stop to Technical Fault - TRAIN STOP TO TECHNICAL FAULT
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 30, 2024, 11:51 AM IST
Train Stopped Due to Technical Fault: గుంటూరులోని మణిపురం వంతెన వద్ద సికింద్రాబాద్ నుంచి రేపల్లె వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలు సాంకేతిక లోపంతో గంటన్నరపాటు నిలిచిపోయింది. పెద్ద శబ్దం వచ్చి, నిప్పురవ్వలు ఎగిసి పడటంతో రైలులోని ప్రయాణికులు చైన్ లాగారు. దీంతో రైలు ఆగిపోయింది. ఈ రైలు గుంటూరు స్టేషన్ నుంచి మణిపురం క్యాబిన్ దాటగానే రాత్రి 7.30 గంటల సమయంలో విద్యుత్తు వైరు తెగిపోయి రైలుకు విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో అక్కడే ఆగిపోయింది. గంటకుపైగా అక్కడే రైలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రైల్వే సిబ్బంది వచ్చి నిప్పురవ్వలు రావడానికి గల కారణాలను పరిశీలించారు.
ఎలక్ట్రిక్ లైన్‌కు సంబంధించిన సాంకేతిక సమస్య కారణంగానే పెద్ద శబ్దం, నిప్పురవ్వలు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. దీంతో సాంకేతిక సిబ్బంది ఆ తీగకు మరమ్మతులు చేయడానికి గంటన్నర సమయం పట్టింది. అప్పటి వరకు ప్రయాణికులు పట్టాలపైనే రాత్రి సమయంలో ఇబ్బందులు పడుతూ వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. గుంటూరు స్టేషన్ నుంచి డీజిల్ ఇంజిన్ పంపడంతో రైలు యథావిథిగా ముందుకు సాగింది. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.