ఎంపీడీవో రమణారావు కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడిన సీఎం చంద్రబాబు - CHANDRABABU PHONE TO MPDO FAMILY
🎬 Watch Now: Feature Video
TDP Leaders Visited MPDO Family Members in Vijayawada: వైఎస్సార్సీపీ నేతల ధనదాహానికి నరసాపురం ఎంపీడీవో వెంకటరమణ అదృశ్యం కావడం దారుణమని తెలుగుదేశం నేతలు అన్నారు. ఎంపీడీవో వెంకటరమణ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. విజయవాడలో టీడీపీ నేతలు ఎంపీడీవో వెంకటరమణ కుటుంబసభ్యులను పరామర్శించారు. ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలుగుదేశం నేతలు తెలిపారు.
CM CHANDRABABU PHONE TO RAMANARAO FAMILY: రమణారావు కుటుంబ సభ్యులతో సీఎం చంద్రబాబు ఫోన్లో మాట్లాడారు. రమణారావు ఆచూకీ తెలియక నాలుగు రోజుల నుంచి తీవ్ర ఆవేదనలో ఉన్న కుటుంబ సభ్యులను పరామర్శించారు. రమణారావు చివరిగా ఇంటి నుంచి వెళ్లేటప్పుడు ఏం చెప్పారు, ఆయన ఒత్తడికి గురవ్వడానికి గల కారణాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. ఉద్యోగ సంబంధిత విషయాల్లో ఇబ్బంది పడ్డారని ఆయన సతీమణి సునీత చంద్రబాబుకు తెలిపారు. ఆమెతో పాటు, కుమారుడు సాయిరాంతో సీఎం ఫోన్ లో మాట్లాడారు. గతంలో ఎప్పుడైనా ఏవైనా అంశాలు మీ దృష్టికి తెచ్చారా అని సీఎం అడిగారు. నిజాయితీపరుడు, సమర్థుడైన అధికారి ఆచూకీ లేకుండా పోవడంపై ముఖ్యమంత్రి విచారం వ్యక్తం చేశారు. వెంకట రమణారావు కుటుంబాన్ని ఆదుకుంటామని, ఘటనపై పూర్తి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. బాధిత కుటుంబం వద్ద ఉన్న పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణితో ముఖ్యమంత్రి మాట్లాడి పలు సూచనలు చేశారు. ఘటనపై లోతుగా దర్యాప్తు జరపాలని ఎప్పటికప్పుడు సీఎం కార్యాలయానికి సమాచారం ఇవ్వాలని కలెక్టర్ ను ఆదేశించారు.
మరోవైపు ఎంపీడీవో వెంకట రమణారావు ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది. విజయవాడలోని ఏలూరు కాలువ వద్ద ఆయన సెల్‌ఫోన్ సిగ్నళ్లు ఆగిపోయినట్లు గుర్తించిన పోలీసులు అక్కడే గాలింపు చేస్తున్నారు. పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కేసరపల్లి నుంచి విజయవాడ వైపు గాలింపు చేపట్టారు. గత రెండు రోజులుగా ఏలూరు కాలువలో ఆచూకీ కోసం గాలింపు చేస్తున్నారు. ఇదే సమయంలో ఎంపీడీవో కాల్‌డేటాను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈనెల 15న ఉదయం ఆయనకు ఓ ఫోన్ వచ్చిందని, ఆ తర్వాత మచిలీపట్నం వెళ్తున్నట్లు హడావుడిగా చెప్పి బయటకు వెళ్లిపోయారని కుటుంబ సభ్యులు వివరిస్తున్నారు. దీని ఆధారంగా ఎంపీడీవో అదృశ్యానికి కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.