మత్స్యకార జాతిని ఎమ్మెల్యే ద్వారంపూడి అవమానించాడు- ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి: కొండబాబు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 25, 2024, 7:46 PM IST
TDP leader Kondababu comments on MLA Dwarampudi: కాకినాడలో చేస్తున్న అక్రమాలపై ప్రశ్నిస్తే మత్స్యకార జాతిని ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అవమానించేలా వ్యాఖ్యలు చేయడంపై మాజీ ఎమ్మెల్యే కొండబాబు మండిపడ్డారు. ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోని మత్స్యకారులకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రశ్నించిన వారిపై తన ప్రైవేట్ సైన్యంతో అరాచక పాలన సాగిస్తున్నాడని ఆరోపించారు. అక్రమంగా కేసులు పెట్టించి ఇబ్బందులకు గురిచేస్తున్నారని కొండబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. గంజాయి దొంగలను పోలీసులు పట్టుకుంటే వారిలో ఏడుగురు ఎమ్మెల్యే అనుచరలు ఉండటం ఎమ్మెల్యే అరాచకాలకు తార్కాణమని ఆరోపించారు. ప్రజలు ద్వారంపూడి చేస్తున్న అణచివేత, దౌర్జన్యాలు చూసి విసిగి పోయారని, రాబోయే ఎన్నికల్లో ప్రజలు తెలుగుదేశం, జనసేన ప్రభుత్వం కోసం ఎదురు చూస్తున్నారని కొండబాబు తెలిపారు.
ద్వారం పూడి అనుచరుల దౌర్జన్యాలు: మరోవైపు కాకినాడ నగరం పూలేపాకల్లో గత 20 ఏళ్లుగా నివాసం ఉంటున్న పేదల ఇళ్లను ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనుచరలు బలవంతంగా తొలగించే యత్నం చేశారు. పూలేపాకల్లో సుమారు 250 మంది నివాసం ఉంటున్నారు. ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్న స్థానికులను ఎమ్మెల్యే కాళీ చేయించి వేరేవారికి కేటాయించేందుకు, సామాన్లు బయట వేసి మూడు పాకలను ధ్వంసం చేశారు. మిగతా వారిని కూడా కాళీ చేయాలని హెచ్చరించారు. ఎమ్మెల్యే ద్వారంపూడి అండతో వారి అనుచరులు దౌర్జన్యానికి పాల్పడ్డారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో జగన్‌కే ఓటేశామని ప్రస్తుతం వాలంటీరుగా సేవలందిస్తున్నా, తన పాకనే పీకేశారని ఓ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు.