టీడీపీ విస్తృతస్థాయి సమావేశం- పొత్తు ధర్మాన్ని పాటించి అభ్యర్థిని గెలిపించాలి: బూరుగుపల్లి శేషారావు - TDP Janasena Meeting At Nidadavolu
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 19, 2024, 10:12 AM IST
TDP- Janasena Held a Large Scale Conference in Nidadavulu: రాష్ట్ర భవిష్యత్తు కోసం ఏర్పడిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి పొత్తు ధర్మాన్ని పాటిస్తూ నిడదవోలు నియోజకవర్గంలో జనసేన పార్టీ అభ్యర్థి కందుల దుర్గేష్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించుకుందామని మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు అన్నారు. నియోజకవర్గ తెలుగుదేశం విస్తృత స్థాయి సమావేశాన్ని నిడదవోలులో నిర్వహించారు. కొందరు కావాలని లేనిపోని అపోహలు సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని అవేమి పట్టించుకోవద్దని కార్యకర్తలకు శేషారావు సూచించారు. శేషారావు తీసుకునే నిర్ణయానికి తామంతా కట్టుబడి ఉంటామని కార్యకర్తలు తెలిపారు.
టీడీపీ నేతలు, కార్యకర్తలు అంతా దుర్గేష్‌ను మన అభ్యర్థిగా భావించి ముందుకు సాగాలని శేషరావు అన్నారు. రాష్ట్రంలో చేతగాని సీఎం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని వారి కష్టాలను తొలగించేందుకు టీడీపీ, జనసేన, బీజేపీలు కూటమిగా ఏర్పడ్డాయని పేర్కొన్నారు. దుర్గేష్‌ను గెలిపించుకునేందుకు ప్రతి ఒక్కరు సైనికుడి మాదిరిగా పని చేయాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి అభ్యర్థి దుర్గేష్ మాట్లాడుతూ గొప్ప ప్రజాదరణ కలిగిన శేషారావు అండదండలతో తాను ముందుకు సాగుతానని వెల్లడించారు.