వెలిగొండ ప్రాజెక్టుపై అబద్దపు ప్రచారాలు ఆపండి: కందుల నారాయణరెడ్డి - కందుల నారాయణ రెడ్డి ప్రెస్‌మీట్
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 25, 2024, 12:43 PM IST
|Updated : Jan 25, 2024, 12:53 PM IST
TDP Former Mla Narayana Reddy Press Meet on Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టుపై వైసీపీ నాయకులు, ఎమ్మెల్యేలు అబద్దపు ప్రచారాలు ఆపాలని మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ధ్వజమెత్తారు. ప్రకాశం జిల్లాలోని తన క్యాంప్ కార్యాలయంలో బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ ప్రాంత ప్రజలను జగన్ మరోసారి మోసం చెయ్యాలని చూస్తున్నారని మండిపడ్డారు. 9.2 మీటర్లు చేయాల్సిన సొరంగం వ్యాసాన్ని 5మీటర్లతో సరి చేసి గొప్పలు చెప్పుకోవడం మీకే చెల్లిందని నారాయణ రెడ్డి మండిపడ్డారు.
వెలిగొండ ప్రాజెక్టు మెుదటి సొరంగం పనులు టీడీపీ హయాంలోనే పూర్తయ్యాయని తెలిపారు. రెండో సొరంగాన్ని మిషన్ల ద్వారా కాకుండా మాన్యువల్‌గా చేసి వైసీపీ నాయకులు డబ్బులు దండుకునేందుకే సిద్ధమయ్యారని ఆరోపించారు. కాలువలు పని పూర్తి చేయకుండా మరోసారి ఈ ప్రాంత ప్రజలను దగా చేసేందుకే సిద్ధమయ్యారని పేర్కొన్నారు. 2021వ సంవత్సరంలో పూర్తయిన మొదటి టన్నెల్ ద్వారా నీరు ఇవ్వకుండా దానికి మూడు రంధ్రాలు వేసి సమాంతరంగా రీటెండరింగ్ ద్వారా ప్రభుత్వానికి డబ్బులు ఆదా చేస్తామని దొంగ మాటలతో కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూరేలా ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రులు వ్యవహరించారని అన్నారు. ముంపు గ్రామాలకు ఒక్క రూపాయి ఇవ్వకుండా ఈ ప్రాజెక్టును జాతికి ఎలా అంకితం చేస్తారో చెప్పాలన్నారు. పునరావాసం, వ్యాసం తగ్గించి టన్నెల్ తవ్వడం లోపబుయిష్టం, కాలువలు సరిగా లేకపోవటం ఇన్ని సమస్యలతో అసంపూర్తిగా ఉందని నారాయణ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.