శింగనమల వైఎస్సార్సీపీలో అసమ్మతి రాగం - అభ్యర్థిని మార్చకపోతే నష్టం తప్పదని హెచ్చరిక - శింగనమల వైఎస్సార్సీపీలో అసమ్మతి
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 2, 2024, 5:30 PM IST
Singanamala YSRCP MLA Candidate Dispute : అనంతపురం జిల్లా శింగనమల వైఎస్సార్సీపీలో అసమ్మతి అగ్గి రాజుకుంది. ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి భర్త సాంబశివారెడ్డి ఏకపక్ష నిర్ణయాలతో పార్టీని నాశనం చేస్తున్నారంటూ నాయకులు, కార్యకర్తలు మండిపడ్డారు. ఏనాడూ పార్టీ కోసం పని చేయని వ్యక్తికి ఎమ్మెల్యే సీటు ఇప్పించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాగైనా అభ్యర్థిని మార్చాలని, లేదంటే ఎన్నికల్లో సహకరించబోమని స్పష్టం చేశారు. అనంతపురంలో మాజీ ఎమ్మెల్యే యామినీబాల నాయకత్వంలో పలువురు నాయకులు, కార్యకర్తలు సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.
శింగనమల నియోజకవర్గానికి ఒక చరిత్ర ఉందని, ముఖ్యమంత్రి జగన్ దీనిని గమనించి సరైన అభ్యర్థిని ప్రకటించాలని యామినీబాల స్పష్టం చేశారు. తన ఏకపక్ష నిర్ణయాలతో నియోజకవర్గంలోని కార్యకర్తలను సాంబశివారెడ్డి తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీ కోసం కష్టపడిన వ్యక్తికి ప్రాధాన్యత ఇచ్చే విధంగా త్వరలో తామంతా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలుస్తామని చెప్పారు. అధిష్ఠానం తమ నిర్ణయాన్ని కాదని సాంబశివారెడ్డికే పట్టం కట్టాలని చూస్తే నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ నష్టపోతుందని చెప్పారు.