సీఎం జగన్​ సభకు స్కూల్​ బస్సులు - సెలవు ప్రకటించిన విద్యా సంస్థలు - YCP SiddhamJagan meeting in Eluru

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 2, 2024, 8:55 PM IST

Schools Holiday Due to YCP Meeting: అధికార బలంతో వైసీపీ నేతలు బరితెగిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని రీతిలో పార్టీ సభలకు పాఠశాలల బస్సులను వైసీపీ నేతలు బలవంతంగా లాక్కుంటున్నారు. ఏలూరు జిల్లా దెందులూరులో శనివారం నిర్వహించనున్న వైసీపీ 'సిద్ధం' సభ విద్యార్థులకు తలనొప్పి తెచ్చిపెట్టింది. సీఎం వస్తున్నారని, ఆర్టీసీ బస్సులు తరలింపు, చెట్లు నరికివేత, డ్వాక్రా మహిళలను తరలించే వైసీపీ నేతలు ఈ సారి ఇంకో అడుగు ముందుకేశారు. 

సీఎం సభ కోసం చుట్టు పక్కల జిల్లాల నుంచి భారీగా జనసమీకరణ చేపట్టాలని నిర్ణయించిన వైసీపీ దీనికి బస్సులు కావాలంటూ పాఠశాలలు, కళాశాలకు సెలవులు ప్రకటించాల్సిందిగా ఆదేశాలిచ్చారు. దీంతో కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లోని పలు ప్రైవేటు విద్యాసంస్థలు సీఎం సభ కోసం బస్సులు తరలిస్తున్నామని అందుకే శనివారం సెలవు ప్రకటిస్తున్నట్లు యాజమాన్యాలు విద్యార్థులకు సందేశాలు పంపాయి. ఇప్పటికే సీఎం సభల పేరిట ఆర్టీసీ బస్సులు తరలించడంతో ఇబ్బంది పడుతున్నామని పాఠశాలలు, కళాశాలలు బస్సులు కూడా తరలిస్తే ఎలాగంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు ఇంటర్మీడియెట్​ పరీక్షను సైతం వాయిదా వేశారు. దీనిపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. విద్యార్థుల భవిష్యత్తుతో జగన్ ప్రభుత్వం చెలగాటం ఆడుతుందని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కోశాధికారి ఎం. సాయికుమార్ విమర్శించారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు శనివారం జరగాల్సిన పర్యావరణ విద్య పరీక్ష జగన్ సర్కార్ రాజకీయ సభ కోసం ఈ నెల 23కి వాయిదా వేసిందని మండిపడ్డారు. సీఎం జగన్ సభ శనివారం ఏలూరు జిల్లా దెందులూరులో ఉండటంతోనే ఈ పరీక్షను వాయిదా వేశారని దుయ్యబట్టారు. శనివారం జరగాల్సిన ఈ పరీక్షను ఈనెల 23కు వాయిదా వేయడం సరైంది కాదన్నారు. శనివారమే పర్యావరణ విద్య పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ ప్రతినిధులు ఇంటర్ బోర్ధు కమిషనర్​ను కలిసి వినతిపత్రం అందజేశారు. పరీక్ష వాయిదా పడటంతో విద్యార్థులు గందరగోళానికి గురౌతున్నారన్నారు. 

ప్రశ్నా పత్రాలు లీకేజీ వంటి గందరగోళ పరిస్థితుల్లో వాయిదా పడుతున్న పరీక్షలు ఇలా ముఖ్యమంత్రి పాల్గొనే సభ కోసం వాయిదా వేయడం ఏమిటని సాయి కుమార్ ప్రశ్నించారు. రాష్ట్రం మొత్తం జరిగే పరీక్షను ఈ ప్రాంతంలో జరిగే సభ కోసం వాయిదా వేయడం సమంజసం కాదన్నారు. ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల బస్సుల్లో జనాలను తరలించడం కోసమే ప్రభుత్వం ఈ పరీక్షను వాయిదా వేసిందని విమర్శించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.