ప్రమాదానికి గురైన స్కూల్ బస్సు - అదృష్టవశాత్తూ తప్పిన పెను ప్రమాదం - షెక్షానుపల్లి పాఠశాల బస్సు ప్రమాదం
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 14, 2024, 1:42 PM IST
School Bus Accident: విద్యార్థులను పాఠశాలకు చేర్చేందుకు వెళ్తున్న బస్సు మార్గంమధ్యలో ప్రమాదానికి గురైంది. అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకుపోయింది. ప్రమాదం విషయం తెలసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు సదరు పాఠశాల వద్ద నిరసన చేపట్టారు. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం షెక్షానుపల్లి గ్రామ సమీపంలో విద్యార్థులతో ప్రయాణిస్తున్న ఓ ప్రైవేటు పాఠశాల బస్సు ప్రమాదానికి గురైంది. బుధవారం ఉదయం సమయంలో జరుట్ల రాంపురం నుంచి 15మంది విద్యార్థులను ఎక్కించుకొని ఉరవకొండలోని పాఠశాలకు బయల్దేరింది.
ఈ సమయంలో స్టీరింగ్ రాడ్ విరిగిపోయి బస్సు అదుపుతప్పి రహదారి పక్కకు దూసుకెళ్లింది. రోడ్డు పక్కన మట్టి దిబ్బలు ఉండటంతో బస్సు బోల్తా పడకుండా ఆ మట్టి దిబ్బలు అడ్డుకున్నాయి. దీంతో పెను ప్రమాదం తప్పినట్లైంది. ఈ ప్రమాదంలో ఒక విద్యార్థికి గాయాలు కాగా, బస్సులోని మిగతా విద్యార్థులు సురక్షితంగా ఉన్నారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు పాఠశాలకు చేరుకుని ఆందోళనకు దిగారు. పాఠశాల గుర్తింపు రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు.