పేదలకు డబ్బులు పంచినంత మాత్రాన అభివృద్ధి సాధ్యం కాదు: పీవీ రమేష్
🎬 Watch Now: Feature Video
Retired IAS Officer PV Ramesh : బటన్లు నొక్కి పేద వర్గాలకు డబ్బులు పంచినంత మాత్రాన అభివృద్ధి సాధ్యం కాదని రాష్ట్ర ఆర్థికశాఖ మాజీ ముఖ్య కార్యదర్శి, విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ అభిప్రాయపడ్డారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపాలంటే మౌలిక వసతుల కల్పన, పరిశ్రమల స్థాపన జరగాలని అన్నారు. జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో ఏపీ ఆర్థిక పరిస్థితి (AP Financial Status)పై ముఖాముఖి కార్యక్రమంలో మాట్లాడిన ఆయన రాష్ట్రంలో మద్యం ద్వారా వచ్చే ఆదాయా గణనీయంగా పెరగడంపై ఆందోళన వ్యక్తం చేశారు.
రాష్ట్ర అప్పులు 8 లక్షల కోట్ల పైమాటే : రాష్ట్రానికి వస్తున్న ఆదాయం కంటే ఖర్చు చాలా ఎక్కువగా ఉన్నాయని పీవీ రమేష్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకున్న అప్పు 5 లక్షల 68 వేల కోట్లకు అప్పులు చేరాయని, ప్రభుత్వ రంగ సంస్థల నుంచి లక్షా 58 వేల కోట్ల అప్పులు తీసుకున్నారని, ప్రభుత్వ గ్యారంటీతో మరో లక్షన్నర కోట్లు అప్పులు తీసుకున్నారని, మొత్తంగా రాష్ట్ర అప్పులు 8 లక్షల కోట్ల పైమాటే ఉంటుందని ఆయన తెలిపారు.
ప్రజల జీవితాల్లో మార్పు లేదు : విభజన తర్వాత పొడవైన కోస్తా తీర ప్రాంతం చూసి రాష్ట్రం బాగా పుంజుకుంటుందని భావించామని కానీ పదేళ్లుగా ఏపీ ఆర్థిక పరిస్థితిపై ఎలాంటి అధ్యయనం లేదని పీవీ రమేష్ అన్నారు. 2014లో ఏపీ స్థూల ఆదాయం 5 లక్షల కోట్లు, తెలంగాణ 4 లక్షల కోట్లు అని, తలసరి ఆదాయం రెండు రాష్ట్రాలలో సమానంగా ఉండేదని గుర్తు చేశారు. ఇప్పుడు ప్రభుత్వ లెక్కల ప్రకారం ఏపీ స్థూల ఆదాయం 14 లక్షల కోట్లకు చేరిందని, పదేళ్లలో రెండున్నర రెట్లు స్థూల ఆదాయం పెరిగిందని తెలిపారు. ప్రజల జీవితాల్లో ఆ మేరకు మార్పులు వచ్చాయా అనేది విశ్లేషిస్తే నిరాశే కలుగుతుందని అన్నారు.