రాజధాని ఫైల్స్ చిత్రానికి ఏ పార్టీతో సంబంధం లేదు: మూవీ యూనిట్ - వర్మకు వ్యతిరేకంగా అమరావతి రైతులు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 13, 2024, 10:47 PM IST
Raajadhani Files Movie: అమరావతి రైతుల ఉద్యమ నేపథ్యంలో తెరకెక్కించిన రాజధాని ఫైల్స్ చిత్రానికి ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని చిత్ర యూనిట్ స్పష్టం చేసింది. రాజధానిలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగానే తాము ఈ చిత్రాన్ని నిర్మించినట్లు దర్శక నిర్మాతలు తెలిపారు. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో ఈ చిత్రం ప్రివ్యూ షోకు అమరావతి రైతు నేతలు హాజరై వీక్షించారు. ఈ నెల 15న ఈ చిత్రం విడుదల కానున్నట్లు దర్శక, నిర్మాతలు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి నటీనటులు వినోద్‌కుమార్, వాణీ విశ్వనాథ్‌తోపాటు ఇతర నటులు హాజరయ్యారు.
అయితే సినీ దర్శకుడు రాం గోపాల్ వర్మ అదే సమయంలో ప్రసాద్ ల్యాబ్ వద్దకు రావడంతో, అమరావతి రైతు నేతలు జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. వ్యూహం చిత్రం మీడియా సమావేశం కోసం వర్మ అక్కడకు వచ్చారు. వర్మ రాకను గమనించిన మహిళ రైతులు, జై అమరావతి అంటూ పెద్దగా నినాదాలు చేశారు. ప్రసాద్ ల్యాబ్ సెక్యూరిటీ సిబ్బంది రైతు నేతలను అడ్డుకున్నారు. రైతుల నినాదాలు పట్టించుకోకుండానే వర్మ అక్కడి నుంచి వెళ్లిపోయారు.
రాజధాని ఫైల్స్ నిలిపివేయాలని హైకోర్టులో పిటిషన్: మరోవైపు రాజధాని ఫైల్స్ సినిమా ప్రదర్శన ఆపాలని కోరుతూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడంపై తీర్పును న్యాయస్థానం వాయిదా వేసింది.