రూ.20 కోట్లు చెల్లించండి - జగన్, సాక్షి పత్రిక, టీవీపై పురందేశ్వరి పరువునష్టం దావా - Purandeshwari Defamation Case - PURANDESHWARI DEFAMATION CASE
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 21, 2024, 3:19 PM IST
Purandeshwari Filed Defamation Case Sakshi Paper and Jagan : సాక్షి పత్రిక, టీవీలో తన పరువుకు నష్టం కలిగించేలా కథనాలు ప్రసారం చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి విజయవాడలోని రెండో ఏడీజే కోర్టులో పురువు నష్టం దావా వేశారు. ప్రతివాదులుగా జగతి పబ్లికేషన్స్ ఎండీ భారతిరెడ్డి, సాక్షి టీవీ ఎడిటర్, సాక్షి పత్రిక ప్రచురణకర్త, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్‌ను పేర్కొన్నారు. విశాఖలో ఇటీవల సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్న కంటైనర్లో డ్రగ్స్ ఉన్నాయని ఆ సంస్థకు, తనకు సంబంధం ఉందని జగన్, సాక్షి మీడియాలో దుష్ప్రచారం చేశారని దావాలో పేర్కొన్నారు.
'సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్ట్స్ కేంద్రంగా భారీ డ్రగ్స్ దందా', 'బీజేపీ నేత పురందేశ్వరి కుటుంబీకులకు వీరభద్రరావు వ్యాపార భాగస్వామి' శీర్షికన కథనాలు ప్రచురించారని ఆక్షేపించారు. రాజకీయ లబ్ది పొందేందుకు జగన్ పలు ఎన్నికల సభల్లో తనపై దుష్ప్రచారం చేశారన్నారు. ఈ ఆరోపణల వల్ల తమ ప్రతిష్ఠకు భంగం కలిగిందన్నారు. దీనిపై గతంలో నోటీసు ఇచ్చినా సరిగా స్పందించలేదన్నారు. పరువునష్టం కలిగించినందుకు రూ.20 కోట్లు పరిహారం చెల్లించేలా చూడాలని కోర్టును అభ్యర్థించారు. కేసును పరిశీలించిన న్యాయాధికారి ప్రతివాదులైన జగన్, ఆయన భార్య భారతి, సాక్షి పత్రిక, టీవీ సంపాదకులకు నోటీసులు జారీ చేశారు. వచ్చే నెల 19కి ఈ కేసు వాయిదా వేశారు.