Training on online Fraud For Unemployed Youth: విదేశాల్లో కొలువులంటూ నిరుద్యోగులకు చైనా ముఠాలు ఎర వేస్తున్నాయి. తొలుత ఏజెంట్ల ద్వారా యువతను ఇతర దేశాలకు తీసుకెళుతున్నారు. అక్కడ సైబర్ మోసాలపై శిక్షణ ఇస్తున్నారు. చెప్పినట్టు వినకపోతే చిత్ర హింసలకు గురి చేస్తున్నారు. గతేడాది కాంబోడియాలో చైనా ముఠా చెర నుంచి 78 మంది ఆంధ్రప్రదేశ్ బాధితులు విముక్తి పొందారు. ఇదే తరహాలో ఏజెంట్ల ద్వారా తైవాన్‌కు వెళ్లి చైనా ముఠాల చెరలో బందీలై కొందరు తాజాగా బయటపడ్డారు. ఉద్యోగాల పేరుతో వచ్చే ప్రకటనల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు చెబుతున్నారు.
కొలువుల పేరుతో: సైబర్ మోసాల్లో శిక్షణ పొంది ఇతర దేశాల నుంచి బయటపడిన కొందరు అదే పనిచేస్తూ డబ్బు సంపాదించాలని చూస్తున్నారు. సాయిరాం, సూర్యమోహన్‌లు అనే ఇద్దరు సైబర్ నేరగాళ్లు 1258 బ్యాంకు ఖాతాలు, పలు సిమ్‌కార్డుల సమాచారం అందించినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇందులో 470 ఖాతాలు విశాఖలో ఆ ఇద్దరు తెరిచినట్లు పోలీసులు గుర్తించారు. వీటి ద్వారా చైనాకు అక్రమంగా రూ.కోట్ల రూపాయల నగదును తరలించారు. ఇటీవల తిరుపతికి చెందిన మహిళను డిజిటల్ అరెస్టు పేరుతో ఆమెను బెదిరించి భారీగా డబ్బులను గుంజారు. దీనిపై పోలీసులు ఆరా తీయగా నిందితులు విశాఖ కంచరపాలెం యువకులని విచారణలో తేలింది. వీరిద్దరూ కాంబోడియాలో సైబర్ మోసాలపై శిక్షణ పొందినట్లు విచారణలో తేలింది.
నమ్మిస్తారు నిరాకరిస్తే చిత్రహింసలే: విద్యార్హతతో సంబంధం లేదంటారు. విదేశాల్లో చట్టపరమైన డేటా ఎంట్రీ ఉద్యోగం అని చెబుతారు. నెలకు రూ.80 వేల ఆకర్షణీయమైన జీతాలంటారు. ఏజెంట్ల ద్వారా వల విసురుతారు. ఒక్కొక్క నిరుద్యోగి నుంచి ఇంచుమించు రూ.1.50 లక్షల వరకు వసూలు చేసి కాంబోడియా, తైవాన్ వంటి దేశాలకు వారిని తరలిస్తారు. ఉద్యోగంలో చేరడానికి ప్రత్యేక నైపుణ్యం అవసరమంటూ సైబర్ మోసాలపై శిక్షణ ఇస్తారు. నకిలీ గుర్తింపుతో ఆన్లైన్లో ప్రజలతో చాట్ చేయిస్తారు. క్రిప్టో కరెన్సీ ప్లాట్ ఫారమ్ అంటూ నమ్మించి పెట్టుబడులు పెట్టించేలా ట్రైనింగ్ ఇస్తారు. స్కామ్ చేయడానికి నిరాకరిస్తే చిత్రహింసలు పెడతారు. పాస్‌పోర్టులు తిరిగి ఇవ్వాలంటే రూ.లక్షలు తిరిగి చెల్లించాలని, లేదంటే కేసులు పెట్టి జైల్లో పెట్టిస్తామంటూ బెదిరింపులకు దిగుతారు.
ఏజెంట్ల సహకారంతో మోసాలు: కొంత కాలం క్రితం గాజువాకకు చెందిన ఏజెంట్ల ద్వారా సామాజిక మాధ్యమాల్లో కంప్యూటర్ ఆపరేటర్ పోస్టుల పేరుతో ప్రకటనలను ఇచ్చారు. అమాయక నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసి బ్యాంకాక్, సింగపూర్ మీదుగా కాంబోడియా పంపారు. అక్కడ పాయిపేట్ వీసా సెంటర్‌కు తరలించి ఓ నెలకు టూరిస్టు వీసాతో పనులు చేయించి చైనా గ్యాంగ్‌కు విక్రయించారు. తాజాగా ఇదే విధంగా విశాఖకు చెందిన యువకుడు హైదరాబాద్‌లో ఏజెంట్ల చేతికి చిక్కి అటునుంచి నుంచి తైవాన్‌కు వెళ్లారు. కోటలాంటి ప్రదేశంలో చాలా మందిని బందీలుగా చేయగా అక్కడి నుంచి తప్పించుకుని వచ్చిన ఆ యువకుడు సైబరాబాద్‌లో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
'10 రోజులపాటు హింసించారు' - రూ.36 లక్షలు పోగొట్టుకున్న విశ్రాంత ఉద్యోగి
నేరాలపై స్పెషల్ ఫోకస్ - 200 మంది సైబర్ కమాండర్లు: డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా