శభాష్ పోలీసన్నా - బలవన్మరణానికి పాల్పడిన వ్యక్తి - సీపీఆర్‌తో ప్రాణం పోసిన ఎస్సై
🎬 Watch Now: Feature Video
Police Saved Life With CPR : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసులు సీపీఆర్ చేసి ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడారు. రాయపోలు వెళ్లే రోడ్డులో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా, బంగాల్‌కు చెందిన ముఖర్జీ అనే వ్యక్తి చెట్టుకు ఉరేసుకున్నాడని సమాచారం వచ్చింది. వివరాల్లోకి వెళ్తే, బంగాల్ రాష్ట్రానికి చెందిన ముఖర్జీ అనే వ్యక్తి ఇబ్రహీంపట్నం పరిధిలో ఓ పరిశ్రమలో కార్మికుడిగా పని చేస్తున్నాడు. అయితే కుటుంబ కలహాల నేపథ్యంలో బలవన్మరణానికి యత్నించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో నగర శివారులో ఓ చెట్టుకు ఉరేసుకున్నాడు. అప్పటికే ఆ వ్యక్తి చెట్టుకు వేలాడుతూ కనిపించాడు.
ముఖర్జీ చనిపోయాడని అతని సన్నిహితులు భావించారు. కానీ వెంటనే అక్కడకు చేరుకున్న ఎస్సై మైబల్లి అతడిని చెట్టు నుంచి కిందకు దింపారు. అయితే సమయస్ఫూర్తితో వ్యవహరించిన ఎస్సై, ముఖర్జీని కింద పడుకోబెట్టి సీపీఆర్ చేసి ప్రాణం పోశారు. దీంతో అక్కడివారంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆ వెంటనే అతడిని సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో ముఖర్జీ చికిత్స పొందుతున్నాడు. కాగా ఉరేసుకొని చనిపోయాడనుకున్న వ్యక్తికి పోలీసులు పునర్జన్మ ప్రసాదించటంతో, ఆ ఎస్సైని పలువురు శభాష్ పోలీస్ అంటూ అభినందించారు.