శేషాచలం అడవుల్లో ఎర్రచందనం కొట్టేశారు - కర్ణాటకలో అమ్ముకున్నారు: పవన్ - Pawan Kalyan at Independence Day - PAWAN KALYAN AT INDEPENDENCE DAY
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 15, 2024, 12:12 PM IST
Pawan Kalyan Speech at Independence Day Celebrations: అప్పట్లో బ్రిటిష్ వారిని, వర్తమానంలో నియంతలను ప్రజలంతా ఏకతాటిపై నిలిచి తరిమి కొట్టారని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. పంద్రాగస్టు సందర్భంగా కాకినాడలో జరిగిన వేడుకుల్లో ఆయన పాల్గొన్నారు. కాకినాడ పోలీసు పరేడ్ మైదానంలో పవన్ కల్యాణ్ జాతీయ జెండా ఎగురవేశారు. అభివృద్ధితో పాటు ప్రజా సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ తమ ప్రభుత్వం పాలన సాగిస్తోందన్నారు. జెండా పండుగ సందర్భంగా పంచాయతీ రాజ్ శాఖలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామన్నారు. స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాల కోసం భారీగా నిధులు పెంచినట్లు వెల్లడించారు.
ప్రజా సంపద దుర్వినియోగం చేసిన వారిని ఎవరినీ వదిలిపెట్టమని హెచ్చరించారు. గత ఐదేళ్లు శాంతిభద్రతలు క్షీణించాయన్న పవన్ కల్యాణ్, గత ప్రభుత్వంలో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందన్నారు. శేషాచలం అడవుల్లో కొట్టేసిన ఎర్రచందనం కర్ణాటకలో అమ్ముకున్నారని విమర్శించారు. రాష్ట్రాభివృద్ధికి షణ్ముఖ వ్యూహంతో ముందుకెళ్తున్నామని పవన్ కల్యాణ్ తెలిపారు. మద్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టుకున్నామని, పేదల ఆకలి తీర్చడానికి ఏర్పాటుచేసే క్యాంటీన్లకు ఎన్టీఆర్ పేరు పెట్టామన్నారు.