ప్రచార ఆర్భాటమేనా?- ప్రజాసమస్యలపై కరవైన 'స్పందన' - స్పందన కార్యక్రమం
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 12, 2024, 4:48 PM IST
No Response in Spandana: వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 'స్పందన' కార్యక్రమం ఆర్భాటంగానే మిగిలిపోయిందనే భావన ప్రజల్లో ఏర్పడింది. అధికారుల చుట్టూ తిరిగి తిరిగి కాళ్లరిగిపోతున్నామే గానీ, తమ సమస్య మాత్రం పరిష్కారం కావట్లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్పందనకు వస్తున్న బాధితులను ఎవరిని కదిలించినా ఇదే సమాధానం చెబుతున్నారు.
కలెక్టరేట్లో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా తమ సమస్య తీరటం లేదంటూ బాధితులు వాపోతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే బాపట్ల జిల్లాలో వెలుగులోకి వచ్చింది. గత 3 సంవత్సరాలుగా కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నా పట్టించుకునే నాథుడే లేడని వాపోయారు. ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి బాగోలేదని, తాను చనిపోయేలోపు అయినా తన సమస్య పరిష్కారం అయ్యేటట్లు లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం: జిల్లాలోని చిన్నగంజాం మండలం కొత్త పాలెంకు చెందిన సూరి శివ పార్వతి తనకు చెందిన భూమిని తన కుమారుడి పేరుపై రిజిస్ట్రేషన్ చేయించేందుకు స్పందనను ఆశ్రయించారు. తమ భూమికి సంబంధించిన డాక్యుమెంట్స్ తీసుకుని కలెక్టరేట్‌కు వెళ్లగా పలు కారణాలు చూపించి అధికారుల చుట్టూ తిప్పుతున్నారు కానీ సమస్య పరిష్కారం కావట్లేదని వాపోయారు. గత 3 సంవత్సరాలుగా ఇదే పరిస్థితి నెలకొందని, స్పందనలో అధికారుల స్పందన కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు.