కోట్ల విలువైన బంగారం, వెండి పట్టివేత - కోయంబత్తూరు తరలిస్తున్న నిందితులు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 2, 2024, 2:44 PM IST
Money and Gold Seized in Kurnool District: ఎన్నికలు సమీపిస్తున్న వేళ కర్నూలు జిల్లాలో 4 కోట్ల 59 లక్షల విలువైన నగదు, బంగారు, వెండి పట్టుబడింది. క్రిష్ణగిరి మండలం అమకతాడు టోల్ ప్లాజా వద్ద కర్నూల్ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు గురువారం రాత్రి వాహన తనిఖీలు చేపట్టారు. హైదరాబాదు నుంచి కోయంబత్తూరు వెళుతున్న ఓ ప్రైవేట్ స్లీపర్ ఏసీ ట్రావెల్స్ బస్సులో సోదాలు నిర్వహించారు.
అందులో నలుగురు ప్రయాణికుల వద్ద నుంచి బంగారం, వెండి సహా నగదును స్వాధీనం చేసుకున్నారు. వీరిని నంద్యాల, కోయంబత్తూర్‌కు చెందిన అమర్ ప్రతాప్, వెంకటేష్ రాహుల్, సెంథిల్‌కుమార్, శబరి రాజన్‌లుగా పోలీసులు గుర్తించారు. వీరి వద్ద నుంచి మొత్తం దాదాపు 2 కోట్ల నగదు, 4 కిలోలకు పైగా బంగారం, 5 కిలోల వెండి బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నారు.
వీరిలో ఒక్కొక్కరి నుంచి ఎంతెంత స్వాధీనం చేసుకున్నారు అంటే, నంద్యాలకు చెందిన అమర్ ప్రతాప్ పవర్ వద్ద కోటి 20 లక్షల 80 వేల నగదు, కోయంబత్తూర్‌కు చెందిన వెంకటేష్ రాహుల్ వద్ద 3 కేజీల 195 గ్రాముల బంగారు, 19 లక్షల 23 వేల 5 వందల నగదు, అదే విధంగా కోయంబత్తూర్‌కు చెందిన సెంథిల్ కుమార్ వద్ద 44 లక్షల 50 వేల నగదు, కేజీ 37 గ్రాముల బంగారం, సేలంకు చెందిన శబరి రాజన్ వద్ద 5 కేజీల వెండి బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నారు. వీటికి ఎలాంటి పత్రాలు లేకపోవడంతో స్వాధీనం చేసుకున్న పోలీసులు, వీటి విలువ 4 కోట్ల 59 లక్షలు ఉంటుందని తెలిపారు.