కాంగ్రెస్ ఇప్పటికైనా తమ తప్పు సరిదిద్దుకోవాలి : మందకృష్ణ మాదిగ - Lok sabha polls 2024 - LOK SABHA POLLS 2024
🎬 Watch Now: Feature Video
Published : Apr 12, 2024, 7:31 PM IST
Manda Krishna Madiga On SC Reserved Seats : ఎన్నికల సీట్ల కేటాయింపుల్లో మాదిగలకు అన్యాయం చేసిన కాంగ్రెస్ ఇప్పటికైనా సరిదిద్దుకోవాలని ఎంఆర్‌పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. ఈ విషయంపై సీఎం రేవంత్‌రెడ్డి, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేలు సమాధానం చెప్పాలన్నారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తాజా ఎన్నికల నేపథ్యంలో "మాదిగల రాజకీయ అస్థిత్వం - కాంగ్రెస్ ద్రోహం" అనే అంశంపై ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఘాటుగా స్పందించారు.
తెలంగాణలో పెద్దపల్లి, వరంగల్, నాగర్‌కర్నూల్లో లోక్‌సభ రిజర్వుడ్ సీట్లు, కంటోన్మెంట్ అసెంబ్లీ సీట్లలో మాదిగలకు ఏ ఒక్కటీ ఇవ్వలేదని మందకృష్ణ ఆక్షేపించారు. ఇదే విషయాన్ని తాజాగా మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత మోత్కుపల్లి నర్సింహులు కూడా ప్రస్తావించి తన ఆవేదన వ్యక్తం చేశారని గుర్తు చేశారు. 70 లక్షలకు పైగా ఉన్న మాదిగలు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయకపోతే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. తాము జనరల్ స్థానాలు అడగడం లేదని తేల్చిచెప్పారు. ఎస్సీ రిజ్వర్వుడ్ సీట్లలో ఈ నెల 18వ తేదీలోగా మాదిగ అభ్యర్థులను ఎంపిక చేసి బీఫారాలు ఇవ్వాలని 16, 17 తేదీల వరకు గడువు ఇస్తున్నామన్నారు. ఈలోగా కనీసం 2 ఎంపీ సీట్లు, కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానం మాదిగలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో మాదిగ పల్లెల్లోకి కాంగ్రెస్ నేతలను రానివ్వబోం అని హెచ్చరించారు. 'గో బ్యాక్ కాంగ్రెస్' అనే నినాదంతో రాజకీయ యాత్ర ప్రారంభిస్తామని హెచ్చరించారు.