ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి కేజీఎఫ్ సినిమా తరహాలో అక్రమాలు చేస్తున్నాడు: టీడీపీ నేత యరపతినేని - Palnadu district
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 17, 2024, 8:09 PM IST
Kasu Mahesh Reddy Irregularities in Palnadu District : గురజాలలో వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి అక్రమాలకు అడ్డు, అదుపు లేకుండా పోయిందని మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మండిపడ్డారు. పల్నాడు జిల్లా గురజాల మండలం మాడుగుల గ్రామంలో జరుగుతున్న అక్రమ రంగురాళ్ల తవ్వకాలను ఆయన పరిశీలించారు. మాడుగుల గ్రామాన్ని దత్తత తీసుకుని వివిధ రకాల అభివృద్ధి పనులు చేశానని తెలిపారు. కానీ, కాసు మహేష్ రెడ్డి అధికారంతో కోట్లాది రూపాయలు విలువైన సహజ సంపదను దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఎంతో విలువచేసే సహజ సంపదను విదేశాలకు అక్రమంగా తరలిస్తుంటే అధికారులు చోద్యం చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ భూమిలో ఎటువంటి అనుమతులు లేకుండా వందల కోట్ల రూపాయల గ్రావెల్ని బయటి ప్రాంతాలకు అక్రమంగా తరలిస్తున్నారని మండిపడ్డారు. కేజీఎఫ్ సినిమా తరహాలో అక్రమాలు చేస్తున్న అధికారులు, ప్రభుత్వం ఎందుకు స్పందించటం లేదని ప్రశ్నించారు. ఈ ప్రాంతంలో విలువైన క్వార్జీ , వైట్ స్టోన్, మట్టి, రంగురాళ్లు తవ్వకాలు యథేచ్చగా సాగుతున్న కూడా అడిగేవారే లేరని ధ్వజమెత్తారు. అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అని ప్రశ్నించారు.